ఎంసెట్ మేమే నిర్వహిస్తాం-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

రాష్ర్టానికి సంబంధించిన ఎంసెట్‌ను తామే నిర్వహించుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. గవర్నర్ నరసింహన్‌తో స్పష్టంచేసినట్లు తెలిసింది. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ దంపతులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

KCR met Governor

-గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్
-సర్వీస్ అధికారుల కేటాయింపు, వివిధ పథకాలపై చర్చ
అనంతరం నరసింహన్‌తో గంటన్నరపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిపాలనపరంగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రణాళికల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా ఎంసెట్ నిర్వహణ వివాదం, అఖిలభారత సర్వీసు అధికారుల కేటాయింపులో కొన్ని మార్పులు, కొత్త పథకాలు తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 75 ప్రకారం ఎంసెట్‌ను ప్రత్యేకంగా నిర్వహించుకొనే హక్కు తమకు ఉందని సీఎం కేసీఆర్.. గవర్నర్‌కు చెప్పినట్లు తెలిసింది. ఉన్నత విద్యామండలి తెలంగాణలో ఉంది కాబట్టి.. ప్రవేశపరీక్ష నిర్వహించే హక్కు ఉందని వివరించారు.

ఎంసెట్‌ను హైదరాబాద్‌లోని జేఎన్టీయూ మాత్రమే నిర్వహిస్తుందని, ఈసారి కూడా అదే పద్ధతిలో జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయాలను పట్టించుకోకుండా ఏపీ సర్కార్ ఏకపక్షంగా తేదీలను ప్రకటించిందని గవర్నర్‌కు ఫిర్యాదుచేసినట్లు సమాచారం. ప్రవేశపరీక్ష నిర్వహణ కమిటీలలో ఆంధ్ర అధికారులను సభ్యులుగా నియమించామని, ఈ క్రమంలో ఏ ఒక్క ఆంధ్ర విద్యార్థికి అన్యాయం జరిగే ఆస్కారం లేదని గవర్నర్‌కు సీఎం కేసీఆర్ చెప్పారు. అవసరమైతే ఏపీ ఎంసెట్ నిర్వహణకు కూడా సహకారమందిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఇక అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులో కొన్ని మార్పులను కోరుతూ కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం కేసీఆర్.. గవర్నర్‌కు తెలిపారు. అటు ఈ మధ్య తాను రాష్ట్రంలో చేసిన ఏరియల్ సర్వేలో వెలుగుచూసిన కొత్త విషయాలతోపాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జలహారం, హరితహారం, చెరువుల పునరుద్ధరణ పురోగతిపై కూడా నరసింహన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. చాలా విషయాలపై ఇద్దరూ సరదాగా మాట్లాడుకొన్నట్లు సమాచారం.