ఈ-మార్కెటింగ్‌ను విస్తరిస్తాం

తనఖా పద్ధతిని ఎత్తివేస్తాం.. రెండు లక్షల వరకు నేరుగా రుణాలిస్తాం
తొలి విడత 500 ఐకేపీ కేంద్రాల బలోపేతం
వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 132 కోట్లు
మార్కెట్ యార్డుల్లో రూ.10కే నాణ్యమైన భోజనం
రైతుబంధు పథకం అమలు చర్చావేదికలో మంత్రి హరీశ్‌రావు వెల్లడి హైదరాబాద్

Harish Rao

మార్కెట్ యార్డుల్లోకి రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి నాణ్యత, పరిమాణం (క్వాలిటీ, క్వాంటిటీ) నిర్ణయించి వెంటనే మద్దతు ధర చెల్లించేవిధంగా ఈ మార్కెంటింగ్, ఈ టెండర్ల విధానాన్ని అంచెలంచెలుగా అన్ని జిల్లాల్లోనూ విస్తరిస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు.

రైతులు ధాన్యం విక్రయించిన వెంటనే టోకెన్లు అందజేసి 24 గంటల్లోగా నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమచేస్తామని చెప్పారు. బుధవారం పొట్టి శ్రీరాములు ఆడిటోరియంలో నిర్వహించిన రైతుబంధు పథకం అమలు – చర్చావేదిక కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రైతుబంధు పథకం అమలు తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి? రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి నుంచి తెలుసుకొని.. అప్పటికప్పుడు అధికారులు పరిష్కార ఉత్తర్వులు జారీచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామని తెలిపారు. రైతులు ధాన్యం మార్కెట్‌కు తరలించి రోజుల తరబడి పడిగాపులు కాయకుండా వెంటనే విక్రయించుకొని ఇంటికి వెళ్లిపోయేవిధంగా ఈ మార్కెటింగ్ విధానం ఉంటుందన్నారు. ఈ మార్కెటింగ్ విధానానికి ఖమ్మంలో శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ విధానం విజయవంతమైతే వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. మార్కెట్ కమిటీ గోదాముల్లో ధాన్యం నిల్వ ఉంచి రైతుబంధు పథకం కింద రుణాలు తీసుకునే వారి నుంచి 6 నెలల వరకు వడ్డీ వసూలు చేయబోమని చెప్పారు.

తనఖా (మార్టగేజ్) పెడితే ఇప్పటివరకు రూ.50 వేల రుణం ఇస్తుండగా, ఇకనుంచి తనఖా లేకుండానే రూ. 2లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రైతుబంధు కార్డు రెన్యూవల్ గడువును మూడు నెలల నుంచి ఆరు నెలలకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయం చేసేవారే మార్కెట్ కమిటీలో డైరెక్టర్లుగా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసే లింకు రోడ్లు కూడా రైతుల కోసమేగానీ డైరెక్టర్ల కోసం కాదని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని, విశ్రాంతి గదులను ఆధునీకరిస్తామని తెలిపారు. ప్రతి మార్కెట్ యార్డులో క్యాంటిన్ ఏర్పాటుచేసి రూ.10కే మినరల్ వాటర్‌తో కూడిన భోజనం అందిస్తామని చెప్పారు. అన్ని జిల్లాల్లో ఈ భోజన వసతిని కల్పిస్తామన్నారు. ఇందులోభాగంగా పరిశుభ్రత పాటించేందుకు నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని స్పష్టంచేశారు. ఈ వసతులన్నింటితో కూడిన విధానాన్ని బోయిన్‌పల్లి మార్కెట్‌లో అమలుచేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. పౌరసరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో తొలిదశ కింద 500 ఐకేపీ కొనుగోలు కేంద్రాలను బలోపేతం చేస్తామని తెలిపారు.

వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ సహకారం తీసుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గోదాముల నిర్మాణం చేపడతామన్నారు. అన్ని జిల్లా మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.132కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆగ్రోస్ అందజేసే వ్యవసాయ యంత్ర పరికరాలనే రైతుల కొనాలన్న నిబంధనను సడలిస్తున్నామన్నారు. రైతులకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు మార్కెట్‌లో నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని, అందాల్సిన సబ్సిడీ నేరుగా రైతులకు ఇస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నదని వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యవసాయ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు జీ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.