ఈ ఏడాదిలోనే కొత్త పింఛన్లు

-మ్యానిఫెస్టో హామీలన్నీ అమలుచేసి తీరుతాం
-అక్రమ కట్టడాలను స్వాధీనం చేసుకునుడే
-రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టీకరణ

Etela Rajendar

ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా వికలాంగులకు రూ.1500, వృద్ధులకు,వితంతువులకు రూ 1000 పింఛన్‌ను ఈ ఏడాదిలోనే అమలుచేసి తీరుతామని ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో టీజేఏసీ ఆధ్వర్యంలో మంత్రికి బుధవారం అభినందన సభ నిర్వహించారు. స్థానిక జేఏసీ చైర్మన్ ఆవునూరి సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గురుకుల్ ట్రస్ట్ భూముల్లో 627ఎకరాలను ఆక్రమించుకొని కట్టడాలు నిర్మించారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామన్నారు.

వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన తమ్ముడు వివేకానందరెడ్డి ట్రస్ట్ భూముల్లోని రెండెకరాల్లో ఇల్లు కట్టుకున్నాడని, ఇదేంటని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండని వెటకారంగా మాట్లాడారని గుర్తుచేశారు. ఇలాంటి అక్రమాలన్నింటిపై ప్రభుత్వం విచారణ జరుపుతుందన్నారు. 2004 లోనే దళితులకు మూడెకరాల భూమి ప్రతిపాదనను టీఆర్‌ఎస్ రూపొందించిందని చెప్పారు. పరిపాలనా సామర్థ్యం మీకు లేదని, పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవాచేశారని.. సామాన్యుడు తల్చుకుంటే ఎంతటి సాహసం చేయగలడో మున్ముందు చూస్తారని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, జేఏసీ జిల్లా కో కన్వీనర్ జే రవీందర్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు ముక్కెర రాజు తదితరులు పాల్గొన్నారు.