దసరా నుంచే డబుల్‌బెడ్ రూమ్ పథకం

-నియోజకవర్గానికి 500 ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళిక
-మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
-నిర్మల్, మంచిర్యాలలో పర్యటన

Indrakaran Reddy

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం దసరా నుంచే డబుల్‌బెడ్‌రూమ్ పథకాన్ని ప్రారంభిస్తామని దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన ఆయన, ముందుగా నిర్మల్ పట్టణంలోని బుధవార్‌పేట్ కాలనీలో 20లక్షలతో ఆర్‌అండ్‌బీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. తర్వాత కమ్యూనిటీ భవనాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం పింజారిగుట్ట ఉదాసీ మఠంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రా రంభించి, మంత్రి పూజలు చేశారు.

ఈసందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 5లక్షలతో పేద ప్రజలకు ఇళ్లను నిర్మిస్తుందనీ, నియోజకవర్గానికి 500 ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు నయపైసా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అన్యాక్రాంతమవుతున్న దేవాలయ శాఖ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. దేవస్థానం (దేవునిపేరుతో పట్టా) పట్టాలను మంజూరు చేస్తామని చెప్పారు. నిర్మల్‌ను టూరిజం స్పాట్‌గా చేసేందుకు కుంటాల జలపాతం, బాసర, శ్రీరాంసాగర్, కడెం, శ్యామ్‌గఢ్, బత్తీస్‌గఢ్‌తో పాటు పలు చారిత్రక కట్టడాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎంపీ ఆలోచన అభినందనీయం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బస్టాండ్‌లో ఒక్క రూపాయికే లీటరు శుద్ధ జలాన్ని అందించే మిషన్‌ను పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాల బస్టాండ్‌లో ఎంపీ బాల్క సుమన్ ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఒక్క రూపాయి కాయన్ వేస్తే లీటరు శుద్ధ జలాన్ని అందించే మిషన్‌ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్లలో ప్రయాణికులు, ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది లీటరు మినరల్ వాటర్‌కు 15 నుంచి 20 లతో కొనుక్కోని తాగాల్సి వస్తోందన్నారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్‌తో మాడ్లాడి పశ్చిమ జిల్లాలో కూడా ఇలాంటి శుద్ద జల నీటి మిషన్‌లను బస్టాండ్లలో ఏర్పాటు చేయించాలని సూచిస్తామన్నారు.

Balka Suman launch purified drinking water machine in manchiryal

సామాన్య ప్రజల కోసమే ఎంపీ బాల్క సుమన్
సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదనే బస్టాండ్లలో మినరల్ వాటర్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. ఇప్పటి వరకు పెద్దపల్లి, గోదావరిఖని, శ్రీరాంపూర్, మంచిర్యాల బస్టాండ్లలో ఈ మిషన్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాను ఉత్తర భారత్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ప్రభుత్వమే ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలల్లో ఇలాంటి మిషన్ లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఎంపీ నిధుల నుంచి ఒక్కో మిషన్‌కు ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక రూపాయికే 1 లీటరు మినరల్ వాటర్ అందించే మిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మందమర్రి, బెల్లంపల్లి, లక్షెట్టిపేట బస్టాండులలో కూడా ఇలాంటి మిషన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.