ద్రోహులకు స్థానం లేదు

-ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజీపీని చిత్తుగా ఓడించాలి
-ఆర్థికమంత్రి ఈటెల పిలుపు

Etela Rajendar
సమైక్యవాదుల కొమ్ముకాస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మెదక్ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి ప్రజలు కర్రు కాచి వాత పెట్టడం ఖాయమన్నారు. తెలంగాణ ద్రోహులకు ఇక్కడ స్థానం లేదని స్పష్టం చేశారు.

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మెదక్ జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్లి, వెల్కటూరు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో మహిళలు మంత్రికి తిలకం దిద్ది మంగళారతులు పట్టారు. డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. కోనాయిపల్లి వెంకటేశ్వరాలయంలో పూజలు నిర్వహించిన మంత్రి, ఆ తర్వాత గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభల్లో ఈటెల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. మూడు నెలల క్రితమే ప్రజలు ఛీకొట్టినా మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లడగటానికి వచ్చారని కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రశ్నించారు. నిరంతరం ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకునేది టీఆర్‌ఎస్ ఒక్కటేనని, మంత్రి హరీశ్‌రావు నిత్యం ఇక్కడి ప్రజలతోనే వుండి అభివృద్ధి చేయటంలో దిట్ట అని ప్రశంసించారు. ఈ కార్యక్రమాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్, టీఆర్‌ఎస్ నేతలు కర్ర శ్రీహరి, జాప శ్రీకాంత్‌రెడ్డి, రాగుల సారయ్య, వేముల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.