డబుల్ బెడ్‌రూం భేష్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకంలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి కానుంది. ఈ పథకాన్ని ఇప్పటికే కేంద్రం అభినందించగా.. తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తగిన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఆయన నివాసంలో కలిశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్‌ను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.

KCR-with-union-minister-venkaiah-naidu

-ఇండ్ల పథకంలో భాగస్వామ్యానికి కేంద్రం, రాష్ట్రం సూత్రప్రాయ అంగీకారం
-రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి సాయం చేయాలి
-స్మార్ట్‌సిటీలు మూడు ఇవ్వాలి కేంద్రమంత్రి వెంకయ్యను కోరిన కేసీఆర్
-రెండు రాష్ర్టాలకు ఆయన గర్వకారణమని ప్రశంస
-హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్ తపన అభినందనీయం: వెంకయ్యనాయుడు
గంటపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంతోపాటు హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేసీఆర్, వెంకయ్యనాయుడు చర్చలు జరిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వెంకయ్యనాయుడికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో కేసీఆర్ వివరించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీటిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి రూ.9000 కోట్ల మేర ఖర్చవుతుందని.. కేంద్రం ఈ పథకానికి ఆర్థిక సాయం అందించాలని వెంకయ్యనాయుడిని కేసీఆర్ కోరారు.

రక్షిత మంచినీటిని అందించడానికి గల కారణాలు, గుజరాత్ రాష్ట్రంలో అమలవుతున్న ఈ ప్రాజెక్టును స్ఫూర్తిగా తీసుకోవడం తదితరాల గురించి కూడా వెల్లడించారు. డబుల్‌బెడ్‌రూం పథకంలో ప్రతి ఇంటిని ఎలా నిర్మించనున్నారో, ఎంత వ్యయం అవుతుందో వెంకయ్యనాయుడికి వివరించారు. స్మార్ట్ సిటీల గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో కనీసంగా రెండు స్మార్ట్‌సిటీలను నిర్మించాలని కేంద్రం నిర్ణయించిందని.. రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా మూడోదానికి కూడా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరారు.

తెలుగు రాష్ర్టాలకు గర్వకారణం: కేసీఆర్
వెంకయ్యనాయుడుతో చర్చల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు బాధ్యతలు నిర్వహిస్తుండటం రెండు తెలుగు రాష్ర్టాలకు గర్వకారణం మాత్రమే కాక ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు. రెండు రాష్ర్టాల్లోనూ తెలుగు ప్రాంతాల అభివృద్ధికి వెంకయ్యనాయుడు సహకారం ఉంటుందన్నారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛభారత్, గృహనిర్మాణం, రోడ్డు రవాణా వ్యవస్థపై చర్చించుకున్నట్లు తెలిపారు. చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని, వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించారని, ఆయన సహకారానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

కేసీఆర్ తపన అభినందనీయం: వెంకయ్యనాయుడు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తపన అభినందనీయమని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన కేసీఆర్ ప్రధానితోనూ, పలువురు కేంద్ర మంత్రులతోనూ తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటికి ఆహ్వానించానని తెలిపారు. ఇది మర్యాదపూర్వక భేటీ అయినా పలు అంశాలపై చర్చించుకున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్‌బెడ్‌రూం పథకాన్ని సంయుక్తంగా చేపడదామని గతంలోనే సూత్రప్రాయ అంగీకారం తెలిపానని గుర్తు చేశారు.

రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఈ పథకం అమలు చేసే ఉద్దేశం ఉందని.. మరింత లోతుగా తమ మంత్రిత్వ శాఖలో పరిశీలన జరిపిన తర్వాత నిర్ణయం జరుగుతుందని వివరించారు. రాష్ర్టాలు-కేంద్రం కలిసి పనిచేయడం ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రధాని కూడా ఈ విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ అవసరాలు, సమస్యలన్నింటిపై సానుకూల దృక్పథంలో పరిశీలిస్తున్నామని.. కలిసి ముందుకెళ్తూ అభివృద్ధి సాధిస్తామని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

దేశంలో వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న హృదయ్ పథకంలో మన రాష్ట్రంలోని వరంగల్ పట్టణానికి స్థానం లభించినందుకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం లాంఛన ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు త్వరలోనే వరంగల్‌కు రానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు జితేందర్‌రెడ్డి, కే కేశవరావు, బీ వినోద్‌కుమార్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రొఫెసర్ సీతారాం నాయక్, బీబీ పాటిల్, సుమన్, రాష్ట్ర మంత్రి కేటీఆర్, అధికారులు నర్సింగ్‌రావు, స్మితా సబర్వాల్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డాక్టర్ వేణుగోపాలాచారి, రామచంద్రు తెజావత్ ఉన్నారు.