దిక్కుతోచకే కాంగ్రెస్ ధర్నాలు

అధికారం పోయి, భవిష్యత్తు కనిపించక, దిక్కుతోచని స్థితిలోనే కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్‌వల్ల రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాదన శుద్ధ అబద్ధమని హరీశ్ స్పష్టంచేశారు.

TRS-Harishrao

– ప్రాణహిత కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు
– రీ డిజైన్‌తో రంగారెడ్డికి అదనంగా 40వేల ఎకరాలకు నీళ్లు
-పాములపర్తి నుంచి 5 టీఎంసీలు ఇవ్వాలనే ప్రతిపాదన
– తట్టెడు మట్టి పని చేయనివారికి నైతికత ఎక్కడిది?
– మొబిలైజేషన్ అడ్వాన్సులకోసమే వాళ్ల ప్రాజెక్టులు
-రంగారెడ్డిలో 168 కోట్లు జేబులో వేసుకున్నారు
– కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు
ప్రాణహిత ప్రాజెక్టుకన్నా 40 వేల ఎకరాలకు అదనంగా పాలమూరు ప్రాజెక్టుతో నీరు ఇస్తామని సోమవారం జలసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. పాములపర్తినుంచి గ్రావిటీద్వారా ఐదు టీఎంసీల నీరివ్వాలనే ప్రతిపాదనకూడా చేస్తున్నామని చెప్పారు. పదేండ్లు అధికారంలో ఉన్నపుడు తట్టెడు మట్టి ఎత్తిపోయని నాయకులు ప్రాజెక్టులను ఉరకలెత్తిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి ప్రాణహిత-చేవెళ్ల శంకుస్థాపన జరిగిన తర్వాత ఎనిమిదేండ్లపాటు మంత్రిగా ఉన్నా.. ప్రాజెక్టుకు 24వేల ఎకరాలు కావలిసి ఉండగా.. కనీసం ఒక్క ఎకరం కూడా సేకరించలేదని ఎద్దేవాచేశారు. సర్వేలు, డిజైన్లు పేరిట కాంగ్రెస్ నాయకులు కోట్ల రూపాయలు దండుకున్నారని హరీశ్ ఆరోపించారు. ఎనిమిదేండ్లలో కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారని, కానీ తాము నాలుగేండ్లలో పూర్తిచేసి చూపిస్తామని స్పష్టం చేశారు.

రీ డిజైన్ రంగారెడ్డికే ప్రయోజనం…
రీ డిజైన్‌వల్ల రంగారెడ్డి జిల్లాకు ఎక్కువ మేలు జరుగుతుంది. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని 2.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ మేం 40వేల ఎకరాలు ఎక్కువ ఇస్తున్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకంద్వారా రంగారెడ్డి జిల్లాకు 2.70 లక్షల ఎకరాలకు నీళ్లించ్చేందుకు డిజైన్ రూపొందించి టెండర్లు కూడా పిలుస్తున్నాం. ప్రాణహిత-చేవెళ్లలో తుమ్మిడిహట్టి నుంచి 695 కిలోమీటర్లు ప్రవహిస్తే గానీ రంగారెడ్డి జిల్లాకు నీళ్లురావు. కానీ పాలమూరు ఎత్తిపోతలో కేవలం 130 కిలోమీటర్ల నుంచే నీళ్లు వస్తాయి.

ప్రాణహితలో ఎనిమిది లిఫ్టులద్వారా 500 మీటర్ల ఎత్తులోకి నీళ్లు రావాలి. పాలమూరు పథకంలో ఐదు లిఫ్టుల ద్వారా 430 మీటర్ల ఎత్తులోకి నీళ్లు వస్తున్నాయి. అంటే.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టునుంచి రంగారెడ్డి జిల్లాకు నీళ్లివ్వాలంటే.. ఖర్చు, లిఫ్టు, దూరంతో పోలిస్తే పాలమూరుద్వారా అంతకంటే ఎక్కువ ఆయకట్టుకు తక్కువ ఖర్చుతోనే అందుతాయి. మరి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు రావాలా? వద్దా? సబితా ఇంద్రారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి అని మంత్రి డిమాండ్‌చేశారు.

పరిగికి వెళ్లి అడుగుతా..
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద పరిగికి 34వేల ఎకరాలకు మాత్రమే నీరు వస్తుంది. అదే పాలమూరు పథకం ద్వారా 80వేల ఎకరాలకు వస్తుంది. మరి పరిగి నియోజకవర్గానికి నీళ్లు కావాల్నా? వద్దా? కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి బదులు చెప్పాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తాము పరిగి నియోజకవర్గానికి వెళ్లి ఈ విషయాన్ని ప్రజల్ని అడుగుతామని అన్నారు. రంగారెడ్డి జిల్లాలోనే అతి పెద్దదైన ఇబ్రహీంపట్నం చెరువును కాంగ్రెస్ నాయకులు ఏనాడూ పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.16 కోట్లతో దానిని అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు.

168 కోట్లు ఎక్కడికి పోయాయో..
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 23, 24, 25 26 ప్యాకేజీలకు రూ.4200 కోట్లతో టెండర్లు పిలిచారు. కానీ ఇప్పటివరకు ఈ నాలుగు ప్యాకేజీలకు రూ.194 కోట్లు విడుదల చేస్తే.. అందులో రూ.26 కోట్ల పని మాత్రమే జరిగింది. మరి మిగిలిన రూ.168 కోట్లు ఎక్కడికి పోయాయో కాంగ్రెస్ నాయకులే చెప్పాలి. సర్వే, డిజైన్, మొబిలైజేషన్ అడ్వాన్స్ కోసమని చెప్పి ఈ మొత్తాన్ని కాంగ్రెస్ నేతలు జేబుల ఏసుకున్నరు. అట్లాంటిది… వీళ్లకు రంగారెడ్డి జిల్లా సాగునీటిపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? ధర్నాకు కేటాయించిన సమయంలో కనీసం పదో వంతు సమయాన్ని అధికారంలో ఉన్నపుడు ప్రాజెక్టు కోసం కేటాయిస్తే… ఎప్పుడో రంగారెడ్డి జిల్లాకు నీళ్లొచ్చేయి. మరి సబితా ఇంద్రారెడ్డి, ఇతర నేతలు ఎందుకు పట్టించుకోలేదు? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

అడ్వాన్సుల కోసమే వాళ్ల ప్రాజెక్టులు…
కాంగ్రెస్ నాయకులు పదేండ్లు అధికారంలో ఉండి పట్టించుకోకుండా ఇపుడు మాత్రం రాజకీయ లబ్ధికోసం ధర్నాలు చేస్తున్నారని హరీశ్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లాకేదో అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్న వీరికి ఆ జిల్లా మీద ప్రేమలేదనే విషయం జనానికి కూడా తెలుసు కాబట్టే అన్ని సీట్లలో వీళ్లను ఓడించారని అన్నారు.. వాళ్లు కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసం ప్రాజెక్టులు కడితే తాము ప్రజలకు నీళ్లివ్వాలనే దృఢసంకల్పంతో ఉన్నామని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో సర్వే, డిజైనింగ్‌కు అంచనా వ్యయంలో కేవలం 0.5 శాతం మాత్రమే కేటాయించగా దానిని కాంగ్రెస్ నేతలు 3.5 శాతానికి పెంచుకొని… జేబులో వేసుకున్నారని ఆరోపించారు.

లైడార్ సర్వే ఎన్నడైనా విన్నారా?
తోటపల్లి ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో సాంకేతికంగా తాను వివరిస్తే.. ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పలేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా అధునాతన లైడార్ సర్వే నిర్వహించి.. ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్ చేపడుతున్నామన్నారు. అసలు ఎప్పుడైనా లైడార్ సర్వే గురించి కాంగ్రెస్ నాయకులు ఆలోచించారా? ఈ సర్వే గురించి విన్నరా? రెండు రోజులు ఆలస్యమైనా సరే.. పకడ్బందీగా ప్రాజెక్టుల డిజైన్ రూపొందించి, పూర్తి చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. అంతేకాదు.. పాములపర్తి రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా రంగారెడ్డి జిల్లాకు ఐదు టీఎంసీల నీళ్లు ఇవ్వాలని కూడా ఆలోచన కూడా చేస్తున్నం అని చెప్పారు. దేవాదుల రీడిజైన్ చేస్తామంటే.. కంతనపల్లి రద్దు అంటున్నారని, ప్రతిపక్షాలు గందరగోళంలో పడిందిగాక… జనాన్ని కూడా గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

చిన్న నీటి వనరులనూ పునరుద్ధరిస్తాం…
రంగారెడ్డి జిల్లాలోని చిన్న నీటి వనరులను కూడా పునరుద్ధరిస్తామని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. మిషన్ కాకతీయ కింద ఇప్పటికే రూ.1063 కోట్లతో 600 చెరువుల పునరుద్ధరణ పనులు చేస్తున్నామని, రెండో విడతను కూడా ఆర్నెల్ల ముందే మొదలుపెడతామన్నారు. జిల్లాకేదో అన్యాయం చేస్తున్నామంటూ కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నపుడు వాళ్లు ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. విలేకరుల సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, యాదయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.