దమ్ముంటే డిపాజిట్ దక్కించుకోండి

-కిషన్‌రెడ్డి, దయాకర్‌రావుకు కేటీఆర్ సవాల్
-టీఆర్‌ఎస్‌లో చేరిన ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్

KTR
మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో దమ్ముంటే డిపాజిట్ దక్కించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దయాకర్‌రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు. ఆదివారం మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బాబు.. జగ్గారెడ్డి పార్టీ అని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థి దొరకనందుకే భూ కబ్జాదారుడు, సమైక్యవాదుల తొత్తు అయిన జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చిందని విమర్శించారు.

తెలంగాణ బీజేపీ నాయకులు ఆంధ్రా బాబుల తొత్తులుగా మారిపోయారని మండిపడ్డారు. జగ్గారెడ్డికి బీజేపీ టికెట్ ఇవ్వడం వెనుక ఆంధ్రా బాబుల హస్తముందన్నాని ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సునీత, వీరేశం తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్
ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్, కాంగ్రెస్ నేత ముడుపు దామోదర్‌రెడ్డి ఆదివారం మంత్రులు కేటీఆర్, జోగురామన్న సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పశ్చిమ అధ్యక్షుడు లోకాభూంరెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, దాదాపు 200మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. దౌల్తాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలను మంత్రు లు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆరునూరైనా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎంపీ నగేశ్, ఆసిఫాబాద్, బోధ్, నిర్మల్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, బాపురావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ నేతలు సత్యనారాయణ, నర్సారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, శ్రీహరినాయక్, ప్రభాకర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.