దళితుల సంక్షేమానికి పెద్దపీట

యాభై ఏండ్లుగా పాలకులు దళితులను ఓటుబ్యాంకుగా చూశారే తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

Etela-Rajendar

-దండోరా అమరుల త్యాగాలు మరువలేనివి
-ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
దండోరా ఉద్యమంలో అమరులైనవారి కుటుంబాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో ఆర్థిక సహాయం అందించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ అమరుల రక్తంతో తెలంగాణ మట్టి తడిసిందని, తెలంగాణ ఉద్యమకారులను, దండోరా ఉద్యమకారులను గౌరవించుకోవడం మన కర్తవ్యమని అన్నారు.

దండోరా ఉద్యమంలో అమరులైన పొన్నాల సురేందర్ మాదిగ, ములుగు మహేష్‌మాదిగ, నడిమింటి దామోదర్, రాధ మాదిగ, చిన్నయాదయ్య, బానయ్య, సంపత్, కాంతారావు, చెల్లూరి ప్రశాంత్ కుటుంబసభ్యులకు రూ.లక్షన్నర చొప్పున చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగల పక్షపాతి అని అన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ మాట్లాడుతూ అమరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ కళాకారుల్లో 99 శాతం మాదిగలే ఉన్నారని అన్నా రు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాములునాయక్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ గౌరవాధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షురాలు సుభద్ర, నేతలు పాపయ్యమాదిగ, దేవయ్యమాదిగ, జీవా, మేకల నరేందర్‌మాదిగ, ఊదరి గోపాల్‌మాదిగ, గోల్కొండ సతీష్, డాక్టర్ ఆడమ్ పాల్గొన్నారు.