దేశ్‌కి నేత కేసీఆర్

-సీఎం సార్ ఆగేబఢో.. హమ్ ఆప్‌కా సాథ్‌హై
-దేశ రాజకీయాల్లో మార్పురావాలి.. మా బతుకులు మారాలి
-15వేల మందికిపైగా ప్రతినిధుల హర్షాతిరేకాలు
-మార్పుకోసం కలిసివస్తామన్న 24 దేశాల ఎన్నారైలు
-ఫెడరల్ ఫ్రంట్‌ను ఆహ్వానిస్తూ ప్లీనరీలో ప్లకార్డులు
-రెట్టించిన ఉత్సాహంలో నాయకులు, కార్యకర్తలు

దేశ్ కి నేత కేసీఆర్.. హమ్ ఆప్ కా సాథ్ హై.. కేసీఆర్ ఆగేబఢో.. హమ్ ఆప్‌కా సాథ్ హై అంటూ టీఆర్‌ఎస్ ప్లీనరీకి హాజరైన పార్టీనేతలు, కార్యకర్తలు మిన్నంటిన నినాదాలు చేశారు. దేశరాజకీయాల్లో గుణాత్మకమైన మార్పుకోసం జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న అంశంతోపాటు రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు ప్లీనరీ వేదికగా సంపూర్ణ మద్దతు లభించింది. హైదరాబాద్‌లోని కొంపల్లిలో ప్రగతి ప్రాంగణం వేదికగా శుక్రవారం జరిగిన ప్లీనరీ దేశచరిత్రలోనే కీలకమైన అధ్యాయానికి నాంది పలికింది. గతానికి భిన్నంగా ఈసారి అధ్యక్ష ఉపన్యాసం ప్రారంభించడానికి ముందు కీలకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును ఉద్దేశించిన తీర్మానాన్ని పార్లమెంటరీ పార్టీనేత కేశవరావు ప్రవేశపెట్టిన వెంటనే సభికుల్లో ఉద్విగ్నపూరితమైన వాతావరణం కనిపించింది. తీర్మానం చదువుతున్నపుడే సభికులు కేసీఆర్ ఆగే బడో.. హమ్ ఆప్‌కా సాథ్ హై అంటూ నినాదాలు చేశారు. దేశరాజకీయాల్లో మార్పు రావాలని, దేశం అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరారు. 24 దేశాల నుంచి వచ్చిన 125 మందికిపైగా ఎన్నారైలు ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు.

ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేసి అసాధ్యమనుకున్న రాష్ర్టాన్ని సాధించుకున్న నేపథ్యంలో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడం పెద్ద కష్టమైన విషయమేమీకాదన్న ముఖ్యమంత్రి వాదనతో సభ ఏకీభవించింది. కాంగ్రెస్, బీజేపీలు దేశానికి ఇప్పటివరకు చేసిందేమీలేదని, వివిధదేశాల అభివృద్ధితో పోలిస్తే మనం చాలా వెనుకబడి ఉన్నామన్న సీఎం.. దేశప్రజలందరినీ ఏకం చేద్దామన్న పిలుపునకు విశేష స్పందన లభించింది. దేశ ఆర్థికరంగాన్ని చైనా తదితర దేశాలతో పోలుస్తూ ప్రసంగిస్తున్నపుడు ప్లీనరీకి హాజరైనవారు పెన్ను, పుస్తకం పట్టుకొని రాసుకోవడం కనిపించింది. సభలో ముఖ్యమంత్రి సంఖ్యలు, అంకెలే కాకుండా పూర్తి సమాచారంతో అన్ని వివరాలను కూలంకషంగా వివరిస్తున్నపుడు ఆశ్చర్యపోయి విన్నారు. ఎమ్మెల్యేల గురించి మీడియాలో రకరకాలుగా వస్తున్నది, 20-30 మందికి టిక్కెట్లు ఇవ్వమని.. కానీ మా ఎమ్మెల్యేలు డైమండ్లు అని సీఎం అనగానే చప్పట్లు మారుమోగాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో దివాళా తీసిందంటూ ఇన్వర్టర్ల కంపెనీలతో పోల్చడంతో మంచి స్పందన కనిపించింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంక్షేమ పథకాల గురించి చెప్పిన తీరు హాస్యాన్ని పండించింది. ఈసారి సభావేదికపై మంత్రులు, ఎంపీలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఇతరులు వారికి కేటాయించిన సీట్లలో కూర్చుని క్రమశిక్షణ పాటించారు.

భారీగా తరలివచ్చిన శ్రేణులు..
ప్లీనరీకి ప్రతీ నియోజకవర్గంనుంచి వందమందికి మించకుండా రావాలని పార్టీ సూచించింది. కానీ, అంచనాలకు మించి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్లీనరీకి తొలుత 13వేలమంది వస్తారని భావించినా.. నియోజకవర్గాల నేతల నుంచి ఒత్తిడి రావడంతో 15వేలవరకు పాస్‌లు ఇచ్చారు. పాస్‌లు లేకపోయినా వేలమంది తమ అభిమాన నేత ఉపన్యాసం వినేందుకు బారులు తీరారు. సభాప్రాంగణం బయట వేలమంది రోడ్లపైనేఉండి తీర్మానాలకు మద్దతు ప్రకటించారు. వచ్చినవారందరికీ వీలైనంతవరకు భోజన సదుపాయాలు అందించారు. సభాప్రాంగణం వెలుపల కూడా మజ్జిగ, నీళ్లను అందుబాటులో ఉంచారు. ఉదయం తొమ్మిదిన్నరకల్లా ప్రాంగణం మొత్తం గులాబీమయమైంది. ప్లీనరీకి వచ్చిన జనాన్ని చూసిన అగ్రనేతల్లో కూడా ఉత్సాహం రెట్టింపైంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడం, పార్టీపై మరింత గౌరవం పెరుగడంతో శ్రేణులు భారీగా ప్లీనరీకి తరలివచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.