దేశానికే ఆదర్శం

-రైతన్న సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
-ఉపముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ, మంత్రులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి , జోగురామన్న
-మూడు జిల్లాల్లో రైతు బంధు చెక్కుల పంపిణీ
-మూడేండ్లలో ఎకరాకు రూ.50 వేల మిగులు: రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శమని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడంతోపాటు 24 గంటల కరెంట్ అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడుచోట్ల జరిగిన సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారిలో, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం బాబాపూర్, నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాంలో జరిగిన రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగురామన్న, ఎంపీ నగేశ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభల్లో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో అధికారులు సమగ్ర భూసర్వే సమర్థంగా నిర్వహించారని ప్రశంసించారు. బంగారు తెలంగాణ రావాలంటే ముందుగా రైతులు అభివృద్ధి చెందాలన్నారు.

రాష్ట్రంలో రైతులను బాగు చేస్తేనే నంబర్ 1 స్థానం దక్కుతుందని సీఎం కేసీఆర్ భావించారన్నారు. గతంలో రెవెన్యూశాఖ పన్నులు వసూలు చేసేదని ఇప్పుడు రెవెన్యూశాఖ వారే పిలిచి రైతులకు డబ్బులు ఇస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు అప్పులు చేయకుండా పంటలను సాగుచేసే స్థాయికి రావాలని పిలుపునిచ్చారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతారో స్పష్టత ఇవ్వడం లేదని మంత్రి పోచారం అన్నారు. రైతులు అధైర్యపడాల్సిన పనిలేదనీ, అందరికీ పెట్టుబడి సాయం అందిస్తామని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాలో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వచ్చే మూడేండ్లలో ఎకరాకు రూ.50 వేల మిగులు ఉండేలాగా రైతులను తయారు చేస్తామన్నారు. 58 లక్షల మంది రైతులు ఆత్మ గౌరవంతో బతుకాలని, తలెత్తుకొని దర్జాగా బతికేలా చేసేందుకే ఈ రైతుబంధు పథకం అమలు చేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో రైతు సమన్వయ సమితుల ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతామని, పంటలకు మద్దతుధర లభించని పక్షంలో రైతు సమన్వయ సమితుల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. ఎస్సారెస్పీకి 365 రోజులు నీరు ఇచ్చేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రైతులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తున్నామన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంతో పాటు ఉచిత విద్యుత్, సాగునీరు ఇస్తున్నామన్నారు. తాజాగా రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నామన్నారు.