దేశం చూపు తెలంగాణవైపు

-అభివృద్ధి, సంక్షేమంలో మనమే ముందు
-ఉప ఎన్నికలో అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలి
-పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు
-మైనార్టీలకు రూ.1100 కోట్ల బడ్జెట్
-డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ
-శిఖండి పార్టీలకు గుణపాఠం చెప్పాలి: ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్

KTR addressing in Warangal meeting with Minorities

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని వెళ్లారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందుకే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. త్వరలో మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తాం. అభివృద్ధి సంక్షేమ పథకాల్లో దూసుకుపోతున్న తెలంగాణవైపు దేశం మొత్తం చూస్తుంటే రాష్ట్ర ప్రజలు వరంగల్ వైపు చూస్తున్నారు అని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం హన్మకొండలోని జక్రియా ఫంక్షన్‌హాల్‌లో జరిగిన మైనార్టీల సభలో మంత్రి మాట్లాడారు.
ఉప ఎన్నికల్లో పసునూరి దయాకర్‌ను అధిక మెజార్టీతో గెలిపిం చాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీలు 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని, 60 నెలల్లో చేసి చూపిస్తామన్నారు. సీఎం కేసీఆర్ సూచనతో, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నామన్నారు. పట్టణాల్లో పోలింగ్ డే అంటే హాలిడేగా మారిందని, ఈ ఉప ఎన్నిక నుంచి దానికి స్వస్తి పలకాలని కోరారు. విద్యావంతులు ఓట్లు వేస్తేనే రేపు రాజకీయ నేతలను నిలదీసే అవకాశం దక్కుతుందన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో మతన్మోద శక్తులను ప్రజలు ఓడించారన్నారు. కుల, మతాల మధ్య చిచ్చుపెడుతున్న ప్రధాని మోదీకి బీహార్ ప్రజలు సరైన సమాధానం చెప్పారన్నారు.

కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలను విస్మరించాయని, సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి రూ.1100 కోట్ల బడ్జెట్ కేటాయించారని, 12 శాతం రిజర్వేషన్లకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలును ఇతర ప్రాంతాలకు తరలించి, ఆ స్థలం లో మైనార్టీ విద్యాసంస్థను నెలకొల్పనున్నట్లు వివరించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మరో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలను అందుకోలేకపోతున్న మైనార్టీల కోసం 60 రెసిడెన్సియల్ కళాశాలలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు గుండు సుధారాణి, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, దాస్యం వినయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చే ఓట్లు అడుగుతున్నాం: మంత్రి పోచారం
ఇచ్చిన హామీలను సాధ్యమైనంత వరకు నెరవేర్చామని, మిగతావి కూడా త్వరలోనే నెరవేర్చుతామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది కాబట్టి ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉన్నదన్నారు. గణపురం మండలం ధర్మారావుపేట, నగరంపల్లి, కొండాపురం, బుద్ధారం గ్రామా ల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై దృష్టి సారించామని తెలిపారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామన్నారు. మంత్రి వెంట టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, నాయకులు సిరికొండ ప్రశాంత్, సిరికొండ క్రాంతికుమార్ ఉన్నారు.

ఏప్రిల్ నుంచి సాగుకు పగలే విద్యుత్: మంత్రి అల్లోల
ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి విద్యుత్‌ను పగటిపూటే 9 గంటలు సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. లింగాలఘనపురం మండలం జీడికల్, గుమ్మడవెల్లి, సిరిపురం, కళ్లెం, మాణిక్యపురం, నాగారం, బండ్లగూడెం, నెల్లుట్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

బీజేపీ వల్లే విద్యుత్ సమస్య: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించా రు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలుపడంతో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు మనకు దక్కలేదన్నా రు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టిన కృష్ఱపట్నం పవర్ ప్లాం టు తరలి పోయిందన్నారు. స్వరాష్ట్రంలో సీమాంధ్ర పార్టీలు అవసరమా అని ప్రశ్నించారు. దయాకర్ గెలుపు ఖాయమైందని, భారీ మెజార్టీ కోసమే ప్రయత్నించాలని కార్యకర్తలను కోరారు. ప్రచారంలో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి ఈటల రాజేందర్
తమది పేదల సంక్షేమం కోసం పనిచేసే ఇంటి ప్రభుత్వమని, అభివృద్ధిని ఓర్వలేక శిఖండి పాత్ర పోషిస్తున్న విపక్షాలకు ఉప ఎన్నికలో ఓట్లతో గుణపాఠం చెప్పాలని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. సంగెం మండలంలోని నార్లవాయి, నల్లబెల్లి, మొండ్రాయి, పల్లార్‌గూడ, క్రిష్ణానగర్, చింతలపల్లి, కుంటపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ ఉద్యమంలో ముందుండి పనిచేసిన సామాన్య కార్యకర్త టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు అత్యధిక ఓట్లు వేయాలని కోరారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. అభివృద్ధిని ఓర్వలేని విపక్షాలు ఆరోపణలుచేస్తున్నాయని, తెలంగాణ ద్రోహుల మాటలను నమ్మొద్దని కోరారు. దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి తదితరులు ఉన్నారు.