దరిద్రం పోవాలె

మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవెల్లి గ్రామంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావుతో పాటు గ్రామస్థులంతా శుక్రవారం శ్రమదానం చేశారు. రోడ్లకు రెండు వైపులా ఉన్న చెత్త కుప్పలను తొలగించారు. మురికి తుమ్మలను, పిచ్చి చెట్లను నరికేశారు.

CM-KCR-in-Gramajyothi-at-Erravelli-of-Gramajyothi-day-2 గ్రామంలోని మురికి కాలువలన్నింటిని శుభ్రం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయిన కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కార్యక్రమం మొత్తాన్ని ముఖ్యమంత్రి కాలినడకన ఊరంతా తిరిగి పర్యవేక్షించారు. ఆరు జేసిబీలు, 24 ట్రాక్టర్లను తెప్పించి గ్రామంలో ఇండ్ల శిథిలాల తొలగింపుకు ఉపయోగించారు. శిథిలావస్థలో ఉన్న 90 ఇండ్లను జేసిబీల సహాయంతో నేలమట్టం చేశారు. ఈ 90 మందితో పాటు గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలందరికి కలిపి 200 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. గ్రామంలో దాదాపు 12 లే అవుట్లు సిద్ధం చేసి ఈ ఇండ్లను నిర్మిస్తారు. ఇందుకు అనుగుణంగా గ్రామస్థులు తమ ఇండ్లను, ప్రహరి గోడలను, బాత్రూమ్‌లను తొలగించుకోవడానికి సిద్ధం అయ్యారు. గ్రామం మొత్తం సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి అనుగుణంగా సహకరిస్తామని, గ్రామంలోని ప్రధాన రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చడానికి అవసరమైతే తమ ఇండ్లలోని కొంత భాగాన్ని తొలగించుకోవడానికి గ్రామస్థలు సంసిద్దత వ్యక్తం చేశారు.

గ్రామం నుండి వెళ్లిపోయి హైదరాబాద్‌, అమెరికా లాంటి ప్రాంతాల్లో స్థిరపడిన ఎర్రవెల్లి వాసులతో కూడా ముఖ్యమంత్రి స్వయంగా, ఫోన్‌ ద్వారా సంప్రదించారు. ముఖ్యమంత్రి కోరిక మేరకు హైదరాబాద్‌, గజ్వేల్‌లో ఉంటున్న వారు శుక్రవారం ఉదయం గ్రామానికి చేరుకున్నారు. వారందరితోనూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ గ్రామంలో సమావేశమయ్యారు. పడావు పడిన తమ ఇండ్లను తొలగించడంతో పాటు ఇండ్ల స్థలాలను గ్రామానికి విరాళంగా ఇవ్వాలని అభ్యర్థించారు. విరాళంగా ఇచ్చిన స్థలంలో వారి పూర్వీకుల పేరుతో గ్రామస్థులందరికి ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్‌, ఇతర నిర్మాణాలు చేపడతామని సిఎం చెప్పారు. గ్రామానికి చెందిన అమెరికా వాసి సుధాకర్‌ రెడ్డితో కూడా ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. హైదరాబాద్‌లో దంత వైద్య శాల నడుపుతున్న డా.రుక్కన్నగారి సునిల్‌ రెడ్డి తల్లిదండ్రులతో పాటు గ్రామానికి వచ్చి తమ ఇంటిని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మిట్టపల్లి యాదిరెడ్డి, పల్లెమీది రాజిరెడ్డి, బంగ్లా రాంరెడ్డి, ఆర్‌.సుధాకర్‌రెడ్డి, ఆర్‌.వెంకటేశం, ఆర్‌.రవీందర్‌రెడ్డి, ఎ.అశోక్‌ రెడ్డి, చంద్రారెడ్డి, మహిపాల్‌ రెడ్డి, బంజర నర్సాగౌడ్‌, శివలక్ష్మి, వై.సంపత్‌రావు, వై.రఘుమోహన్‌రావు, వై.శ్రీధర్‌ రావు, వై.శ్రీనాథ్‌ తదితరులు దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఇండ్ల స్థలాలను విరాళంగా అందించారు. హెడ్‌మాష్టర్‌గా పనిచేసి రిటైరైన రుక్కన్నగారి బలరాం రెడ్డి తన ఇంటి స్థలాన్ని విరాళంగా ఇస్తానని, గ్రామంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని కేసిఆర్‌ ను కోరారు. దీనికి కేసిఆర్‌ సానుకూలంగా స్పందించారు. గ్రామంలో ప్రజలంతా ఐకమత్యంగా ఉండడంతో పాటు, గ్రామం వదిలి వెళ్లిన వారు కూడా గ్రామం పట్ల తమ ప్రేమను చూపడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎర్రవెల్లి గ్రామ రైతుగా ఈ గ్రామ రుణం తీర్చుకునే అవకాశం తనకు వచ్చిందని కూడా సిఎం అన్నారు. దాతలను ఘనంగా సన్మానించారు. శ్రమదానం సందర్బంగా గ్రామస్థులందరితో కలిసి ముఖ్యమంత్రి సహపంక్తి భోజనం చేశారు. శనివారం కూడా గ్రామంలో శ్రమదానం కార్యక్రమం కొనసాగిస్తామని గ్రామస్థులు ముఖ్యమంత్రికి మాటిచ్చారు. గ్రామంలో రైతులందరికి డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందిస్తామని, వ్యవసాయరంగాన్ని అభివృద్ది చేస్తామని సిఎం చెప్పారు.