కరెంటు సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించం

– సీలేరు హైడల్ ప్రాజెక్టు ఏపీకి పోవడం నష్టమే
– కృష్ణాజలాల్లో చుక్కనీరు వదులుకోం: మంత్రి జగదీశ్‌రెడ్డి

Jaqgadish-Reddy

సీలేరు హైడల్ విద్యుత్ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పోవడం వల్ల విద్యుదుత్పత్తికి కొంతనష్టం జరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్లగొండ జెడ్పీ సర్వ సభ్యసమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు వచ్చే కరెంట్‌లో ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రజాప్రతినిధులు, ప్రజలు.. అధికార యంత్రాంగం దృష్టికి, లేదా తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జలాల్లో రాష్ర్టానికి రావాల్సిన వాటాలో చుక్క నీటిని వదులుకునేది లేదని తేల్చిచెప్పారు.

నాగార్జునసాగర్ నీరు డెడ్‌స్టోరేజీలో ఉన్నప్పటికీ, ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి ఎడమకాల్వకు నీటిని విడుదల చేశామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కచ్చితంగా తీసుకుంటామన్నారు. మొదటి విడతగా నల్లగొండ జిల్లాకు తీసుకున్నామని, రెండో విడతగా ఖమ్మం జిల్లాకు నీరు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. కరువు పరిస్థితి ఉన్నందున ప్రత్యామ్నయమార్గాలు ఆలోచిస్తున్నామని, రైతులు కరెంట్‌కోతలపై ఓపిక ప్రదర్శించాలని కోరారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.