కాప్-12 సదస్సుకు మంత్రి జోగురామన్న

-రేపటి నుంచి ఈ నెల 18 వరకు దక్షిణకొరియా, థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో పర్యటన

Jogu Ramanna

దక్షిణకొరియాలో నిర్వహించే కాప్-12 అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న హాజరుకానున్నారు. దక్షిణకొరియా దేశంలోని గ్యాంగ్‌వన్ ప్రావిన్స్, పెన్‌చాంగ్‌లో ఆల్‌పెన్సియా కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 12నుంచి 14వ తేదీవరకు జరుగనున్న బయో డైవర్సిటీ అంతర్జాతీయ కాప్-12 సదస్సుకు హాజరవుతున్నారు.

సదస్సులో 192 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. సదస్సులో పాల్గొనేందుకు మంత్రి రామన్న నేతృత్వంలో అధికారుల బృందం శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దక్షిణ కొరియాకు బయల్దేరనున్నారు. 12న చర్చగోష్ఠిలో మంత్రి పాల్గొంటారు. 13న పెన్‌చాంగ్‌లో ప్రారంభమయ్యే సదస్సులో హైదరాబాద్‌లో జరిగిన క్యాంప్ 11 సదస్సు టార్చ్‌ను దక్షిణకొరియా ప్రతినిధులకు జోగురామన్న అందజేస్తారు. 14న హరిత భవిష్యత్ బయోడైవర్సిటీ ప్రణాళిక పట్టణాలు, నగరాల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. 15న దక్షిణకొరియానుంచి థాయ్‌లాండ్‌కు వెళ్తారు. 16, 17న బ్యాంకాక్‌లోని సీతాకోకచిలుక పక్షుల పార్కులను సందర్శిస్తారు. 18న బ్యాంకాక్ నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు.