కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి..మరో మూడునెలలు పొడిగింపు

-నేడు ఉత్తర్వులు జారీ: ఈటెల
-హౌజింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో తెలంగాణ సంబరాలు
-పాల్గొన్న ఆర్థిక మంత్రి, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్

Etela Rajendar

సోమవారంతో ముగియనున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అవుతాయని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ భవనంలో తెలంగాణ గృహ నిర్మాణ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం ఆదివారం నిర్వహించిన తెలంగాణ సంబురాల్లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థకు మూల పురుషుడు చంద్రబాబేనన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలలో వెలుగులు నింపాలనే కృత నిశ్చయంతో కేసీఆర్ ఉన్నారని, ఈ విషయంపై పూర్తిస్థాయిలో స్టడీ చేస్తున్నారని మంత్రి తెలిపారు. పాలకులు ఎలా ఉంటే కిందిస్థాయి సిబ్బంది అలాగే ఉంటారని మంత్రి అన్నారు. అందుకే రాజకీయ అవినీతిని అంత మొందించడం ద్వారా సత్ఫలితాలు పొందేందుకు ప్రయత్నం చేస్తునామన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అవినీతికి అస్కారం ఉండకూడదనేది టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పేదలందరికీ రెండు బెడ్ రూమ్‌ల ఇండ్లు కట్టిస్తానన్న కేసీఆర్ హామీని అమలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఈటెల తెలిపారు. ఎన్నికల వాగ్ధానాలను తీర్చడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని, ప్రతి హామీని నెరవేరుస్తామని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్‌ఎస్‌తో పాటు ఉద్యోగులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు కీలకపాత్ర వహించారని అన్నారు. తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అప్పారావు ఉద్యోగుల సమస్యలను మంత్రి ఈటెల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీవోల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంధం రాములు, హౌజింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు జంపాల సుమన్, వెంకటేశ్వర్లు, భగవంతరావు, ఎస్‌కేలాల్, శివారెడ్డి, ఆంజనేయులు, ప్రవీణ్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.