కాంగ్రెస్ మాటలు సిగ్గుచేటు : కేకే

– ఆ పార్టీ అన్ని రకాల బాధలు పెట్టి ఇప్పుడు తెలంగాణ ఇచ్చామంటోంది.. దానిని ప్రజలు నమ్మరు: కేకే
– గులాబీ దళంలోకి వైఎస్సార్సీపీ నేత సురేందర్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో వెయ్యిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేల మంది జైళ్లకుపోయారు. జైళ్లకు వెళ్లినవారిని విడిపించేందుకు బెయిల్ కోసం రెండుకోట్ల రూపాయల వరకు కట్టాం. కానీ ఉద్యమంలో అన్ని రకాల బాధలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ తెచ్చాం, ఇచ్చాం అంటుంటే సిగ్గేస్తోంది. ఆ పార్టీ నేతల మాటలను తెలంగాణ ప్రజలెవ్వరూ నమ్మరు అని టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు తెలిపారు.

పోలీసులు పెట్టిన కేసుల వల్ల తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారని, దీనికి కూడా కాంగ్రెస్ నేతలే కారణమని మండిపడ్డారు. ఇంతచేసిన కాంగ్రెస్.. మళ్లీ ఎన్నికల వేళ తెలంగాణవాదులు, విద్యార్థులు, ప్రజల గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తోందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి ఎం సురేందర్‌రెడ్డి, నేతలు ఇబ్రహీం ఖలీల్, రిటైర్డ్ ఎస్‌ఐ ఫకీర్ అహ్మద్, తదితరులు బుధవారం తెలంగాణ భవన్‌లో కేకే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ తెలంగాణ గురించి కేసీఆర్ మనసులో ఎన్నో కలలు ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయని, తెలంగాణ సాధించుకున్నంత మాత్రాన మన లక్ష్యం పూర్తికాలేదన్నారు. ఏ అన్యాయాల గురించైతే మనం ఇన్నాళ్లూ మాట్లాడామో వాటిని పూర్తిగా రూపుమాపాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం చేసిన తరువాతే మనం ఏదో సాధించామని సంతోషపడాలని, ఇప్పుడు కానేకాదని అన్నారు. ప్రజలే తెలంగాణను తెచ్చుకున్నారని, ప్రజలే తెలంగాణను ఇచ్చారని తెలిపారు.

పార్లమెంట్ అనేది ప్రజలసభ అని, అందరూ సహకరిస్తేనే తెలంగాణ వచ్చిందని, కాంగ్రెస్ నేతలు ఎంత మాట్లాడినా తెలంగాణ ప్రజల ఆదరణను పొందలేరని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల త్యాగాన్ని, అమరవీరుల త్యాగాన్ని మరువదని పేర్కొన్నారు. ఎంతోమంది టీఆర్‌ఎస్‌లోకి వచ్చి చేరుతున్నారని తెలిపారు. తెలంగాణ కోసం ఎంతోమంది ఉద్యమించారని, ఇంకా ఎంతో పెద్ద ఉద్యమం చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం కేసీఆర్, ఆయన సహచరుల వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. పార్టీలోకి వస్తున్న అందరినీ ఆహ్వానిస్తున్నామని, మనందరం కలిస్తేనే పునర్నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నవ తెలంగాణ నిర్మాణానికి అందరం అంకితం అవ్వాలని, ఎంతో పవిత్రమైన నవ తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలని సూచించారు. ఉద్యోగుల పంపకాలలో ఆప్షన్ ఇవ్వడమనేది చాలా దారుణమని మండిపడ్డారు. ఆప్షన్ ఉండకూడదని, తెలంగాణ రాష్ట్ర చట్టంలో కొన్ని అంశాల్లో మనకు అన్యాయం జరిగిందని తెలిపారు.