కాంగ్రెస్‌కు ఘోర పరాభావమే : కేటీఆర్

దేశంలో కాంగ్రెస్ ఘోర పరాభావం ఎదుర్కోబోతుందని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియాతో కేటీఆర్ మాటలు.. ‘కాంగ్రెస్‌కు ఓటేస్తే మురిగిపోవడం ఖాయం. కాంగ్రెస్‌కు దేశ వ్యాప్తంగా 70 సీట్లు కూడా రావు. పొన్నాల లక్ష్మయ్య ఉద్యమ ద్రోహి. తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నప్పుడు అమెరికాలో పడుకున్నది ఎవరో ప్రజలకు తెలుసు. తెలంగాణ ఉద్యమ నేత ఎవరన్న దానిపై పొన్నాల చర్చకు సిద్ధమా? పొన్నాల సొంత ఊరు ఖిలాషాపూర్‌లోనే చర్చ పెడదాం. పొన్నాల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. పొన్నాలకు చేతనైతే మేం అడిగిన ప్రశ్నలకు సోనియాతో సమాధానం చెప్పిస్తావా? పోలవరంతో పాటు ప్రాణహిత – చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి. పోలవరం డిజైన్ మార్చేలా సోనియాతో చెప్పించాలి. పోలవరం ముంపు మండలాలు తెలంగాణలో ఉండేలా సోనియాతో చెప్పించాలి. ప్రత్యేక ఆర్డినెన్స్ రద్దు చేయించాలి. ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రకు పోవాలని సోనియాతో చెప్పిస్తావా. ఉద్యోగులకు ఆప్షన్లు లేవని సోనియాతో చెప్పించండి మేము కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తాం. పై వాటికి చేతనైతే, చేవ ఉంటే సోనియాతో సమాధానం చెప్పించండి. ఉద్యోగులకు ఆప్షన్లు ఇస్తే ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు రావు.

నష్టపోయిన తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. తెలంగాణ అన్ని రంగాల్లో దోపిడీకి గురైంది. సోనియాకు తెలంగాణపై సోయి తెచ్చింది టీఆర్‌ఎస్ కదా. కాంగ్రెస్ నయవంచన వల్లే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయి. ఎంతో మంది ఆత్మహత్యల తర్వాతే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ నేతల పేర్లు సూసైడ్ నోట్‌లో రాసి చనిపోయారు. ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన సోనియా, పొన్నాల తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ఏం చేశారని కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలి. కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం. కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ నేతలను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదని’ చెబుతూ మీడియా సమావేశాన్ని ముగించారు.