సీఎన్‌ఎన్-ఐబీఎన్ పాపులర్ చాయిస్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ కేసీఆర్

– ప్రదానం చేసిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ
– కేసీఆర్ తరఫున అందుకున్న ఎంపీ కేశవరావు
– తెలంగాణ అమరులకే అవార్డు అంకితమని ప్రకటన

KCR
దశాబ్దంపైగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఉరకలెత్తించి.. గమ్యానికి చేర్చి.. తెలంగాణ రాష్ట్రం సాధించడమేకాకుండా.. రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించిన టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఘనతను యావద్దేశం గుర్తించింది. ప్రముఖ ఆంగ్ల టీవీ చానల్ సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఏటా వివిధ విభాగాల్లో ప్రకటించే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు 2014 సంవత్సరానికి గాను పాపులర్ చాయిస్ విభాగంలో కేసీఆర్ ఎంపికయ్యారు.
క్రీడలు, వ్యాపారరంగం, వినోదరంగం తదితరాల్లో ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌లను జ్యూరీ ఎంపిక చేయగా.. ఇంటర్నెట్ ద్వారా సేకరించిన జనాభిప్రాయంలో కేసీఆర్ పాపులర్ చాయిస్ విభాగంలో అగ్రభాగాన నిలిచారు. ఈ అవార్డును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ కే కేశవరావుకు అందజేశారు. రాజకీయం, స్పోర్ట్స్, బిజినెస్, గ్లోబల్ ఇండియన్, ఎంటర్‌టైన్‌మెంట్, పాపులర్ చాయిస్, పబ్లిక్ సర్వీస్ అనే విభాగాల్లో 2014వ సంవత్సరానికి ప్రతి విభాగంలో ఆరుగురు నామినీలను ఎంపిక చేసి.. వారి నుంచి ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌లను ఎంపిక చేశారు. ఇందులో పాపులర్ చాయిస్ విభాగంలో రాజకీయ కేటగిరీలో కేసీఆర్ ముందు వరుసలో నిలిచారు. భారతదేశ చరిత్రలో రాష్ట్ర సాధన కోసం దీర్ఘకాలం శాంతియుత ఉద్యమం నడిపిన రాజకీయ నాయకుడిగా, చివరికి ఆ ఉద్యమం ద్వారా రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ ప్రజల నుంచి భారీ స్థాయిలో గుర్తింపు పొందారని, దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కూడా అయ్యారని ఆ చానల్ పేర్కొంది.

దశాబ్ద కాలానికి పైగా రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నడిపిన గుర్తింపు కేసీఆర్‌కే దక్కిందని వ్యాఖ్యానించింది. ఇదే కేటగిరీలో కేరళకు చెందిన పోలీసు అధికారి విజయన్ కూడా అవార్డు పొందారు. 2014 సంవత్సరానికి ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రధాని నరేంద్రమోదీ నిలిచారు. జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఇస్రో బృందం చేజిక్కించుకుంది. రాజకీయ నేతల్లో అరుణ్‌జైట్లీని జ్యూరీ ఎంపిక చేసింది.

CNN_IBN indian of the year award to CM  KCR

ప్రజలు, అమరవీరులకే అవార్డు అంకితం:కేకే
ఈ అవార్డును అందుకున్న అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నిర్వహించి అశేష ప్రజలను ఇందులోకి ఆకర్షించిన కేసీఆర్ దేశస్థాయిలోనే పాపులర్ లీడర్ అని కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం అన్ని సెక్షన్ల ప్రజలు ఉద్యమంలోకి వచ్చారని, వెయ్యి మందికి పైగా యువకులు ఆత్మత్యాగం చేశారని చెప్పిన కేసీఆర్.. ఈ అవార్డు వారికే అంకితమని అన్నారు. ఎంపీ బీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఓట్లద్వారా కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, ఇప్పుడు దేశ స్థాయిలో ప్రజలు ఇంటర్నెట్ ఓటింగ్ ద్వారా సీఎన్‌ఎన్ ఐబీఎన్ చాననెల్ నిర్వహించిన సర్వేలో పాపులర్ లీడర్ ఆఫ్ ది ఇండియాగా ఎన్నుకున్నారని అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వైపు యావత్తు దేశ దృష్టి ఉన్నదని, 29వ రాష్ట్రం అయినప్పటికీ తొలి స్థానంలో నిలబెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలతో యావత్తు దేశాన్ని ఆకర్షించారని అన్నారు.

ఎంపీలు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ప్రొఫెసర్ సీతారాం నాయక్ తదితరులు కూడా కేసీఆర్‌ను దేశం మొత్తం మీద పాపులర్ లీడర్‌గా ప్రజలు ఎన్నుకోవడం సంతోషకరమని, ప్రజాదరణ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదని, యావత్తు దేశంలోనే కేసీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, నజ్మా హెప్తుల్లా, రవిశంకర్ ప్రసాద్, సినీ నటులు ఖుష్బూ, మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ హారిస్, మాజీ అటార్నీ జనరల్ సోలి సోరబ్జీ తదితరులు పాల్గొన్నారు.

అవార్డులు పొందింది వీరే..
ఇండియన్ ఆఫ్ ది ఇయర్ : నరేంద్రమోదీ
అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్: అజీం ప్రేమ్‌జీ, కైలాశ్ సత్యార్థి
పాపులర్ చాయిస్ : కే చంద్రశేఖర్‌రావు, పీ విజయన్
రాజకీయం: అరుణ్‌జైట్లీ (కేంద్ర ఆర్థిక మంత్రి)
గ్లోబల్ ఇండియన్: సత్య నాదెంళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈవో)
క్రీడలు : జితు రాయ్
బిజినెస్ : ఎన్ చంద్రశేఖరన్ (టీసీఎస్)
వినోదరంగం : చేతన్ భగత్ (రచయిత)
ప్రజాసేవ : తంగమ్ రినా (జర్నలిస్టు)