గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

రెండు రోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి నేరుగా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. సుమారు ఆరగంటకు పైగా సమావేశమైన సీఎం, పలువిషయాలపై గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ ఒప్పందంతో పాటు, కృష్ణా జలాలపై బోర్డు ఇచ్చిన ఆదేశాలపై ఆయన గవర్నర్‌తో చర్చించినట్లు తెలిసింది.

CM KCR meet Governor

కృష్ణా వాటర్ బోర్డు ఆదేశం తెలంగాణకు తీరని నష్టాన్ని కలిగించే విధంగా ఉందని, దీనిపై తెలంగాణకు న్యాయం జరిగేలా కేంద్రానికి నివేదిక పంపాలని కోరినట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 5 నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణపై కూడా సీఎం చర్చించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే కేసీఆర్ నేరుగా రాజ్‌భవన్ వెళ్లడం చర్చనీయాంశమైంది.