సీఎం ఢిల్లీ టూర్ స‌క్సెస్‌

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మూడు రోజుల ఢిల్లీ పర్యటనను పూర్తిచేసుకొని సోమవారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎంకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ప్లానింగ్ కమిషన్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలిచిన కొత్త వ్యవస్థపై ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఆదివారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్ శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. సీఎం సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం సోమవారం కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సోమవారం ఉదయం పార్లమెంటుకు వెళ్ళిన కేసీఆర్.. కొద్దిసేపు అక్కడి టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో ముచ్చటించారు.

KCR-along-with-MP's

-ముఖ్యమంత్రుల సదస్సులో కేసీఆర్ కీలక సూచనలు
-హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి పార్లమెంటుకు వచ్చిన కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ ఎంపీలు స్వాగతం పలికారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న విధానాన్ని, తెలంగాణతో పాటు వివిధ జాతీయ అంశాలపై టీఆర్‌ఎస్ ఎంపీలు చర్చలో పాల్గొనడంపై కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాల్‌ను కూడా సందర్శించారు. కేంద్ర మంత్రులంతా పార్లమెంటు సమావేశాల్లో ఉండిపోవడంతో కలవలేకపోయారు.

అనంతరం పార్లమెంటు ఆవరణలో తెలుగు పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు. ప్లానింగ్ కమిషన్ స్థానంలో కొత్తగా ఉనికిలోకి రానున్న వ్యవస్థ గురించీ, దానివల్ల దేశ ఆర్థిక స్వరూపంలో వచ్చే గుణాత్మక మార్పులు, రాష్ర్టాలకు జరగనున్న మేలు తదితర అంశాలపై సమావేశంలో చేసిన ప్రసంగం గురించీ, ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాల గురించి కేసీఆర్ మీడియా మిత్రులతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం గురించీ, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో వస్తున్న ఇబ్బందుల గురించీ మీడియా ప్రతినిధులు ప్రస్తావన తీసుకురాగా, ఆందోళన పడాల్సిన పనేమీ లేదని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లుగా అన్నింటికీ పరిష్కారం ఉంటుందని వ్యాఖ్యానించారు.