చౌక సేద్యానికి పరిశోధనలు తోడ్పడాలి

-వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలకు మంత్రి పోచారం పిలుపు

Pocharam Srinivas Reddy 01

చౌకగా పంటల సేద్యానికి వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలు తోడ్పాటునివ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. కళాశాలతోపాటు పరిశోధనా కేంద్రాలను పరిశీలించిన పోచారం.. ఆయా సంస్థల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు.

పరిశోధనలు, బోధన, విస్తరణ ప్రధానాంశాలుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందుకు వెళుతుందన్నారు. భవిష్యత్‌లో శాస్త్రవేత్తలు, అధ్యాపకుల మధ్య పూర్తిస్థాయి సహకారం, సమన్వయానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి పోచారం తెలిపారు. మంత్రితోపాటు వర్సిటీ ప్రత్యేకాధికారి డాక్టర్ వీ ప్రవీణ్‌రావు, ఉన్నతాధికారులు డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ టీ వీ కే సింగ్, డాక్టర్ పీ చంద్రశేఖర్‌రావు, డాక్టర్ జీ భూపాల్‌రాజ్, డాక్టర్ రాజారాంరెడ్డి తదితరులు ఉన్నారు.