చిన్న జీవితాలకు పెద్ద భరోసా

-అసంఘటిత కార్మికులకు అండగా సీఎం కేసీఆర్
-బీడీ కార్మికులకు రూ.వెయ్యి పెన్షన్
-ఆటో డ్రైవర్లకు రవాణా పన్ను రద్దు
-అంగన్‌వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి

KCR

అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్న తన సంకల్పాన్ని సీఎం కేసీఆర్ ఒక్కొక్క కార్యక్రమం ద్వారా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాలన్న సదాశయంతో అసంఘటిత రంగ కార్మికులకు అండగా నిలిచారు. వివిధ రంగాలలోని అసంఘటిత కార్మికులను కలిసి వారి సమస్యలు విని పరిష్కరానికి మార్గాలు వేస్తున్నారు. సీఎంతో సచివాలయంలో మూడు గంటలపాటు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అంగన్‌వాడీ వర్కర్లకు దొరికింది. తనను కలవడానికి వచ్చిన అంగన్‌వాడీ వర్కర్లను సాదరంగా సచివాలయానికి ఆహ్వానించి వారి సమస్యలన్నీ ఆలకించారు. వెంటనే పరిష్కారానికి మార్గాలు వేశారు. వేతనాలు పెంచుతానని అక్కడికక్కడే ప్రకటించారు. బీడీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, ఆర్‌ఎంపీ, పీఎంపీలు, డ్రైవర్ కం ఓనర్ పథకం ఇలా అనేక రంగాల వారి అభివృద్ధికి సీఎం అనేక నిర్ణయాలు తీసుకున్నారు.

బాధలు అర్థం చేసుకున్న నాయకుడు
తెలంగాణ ఉద్యమంలో సగటు తెలంగాణవాసి కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూసిన కేసీఆర్, వాటిని తొలగించేందుకు విశ్రాంతిలేకుండా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ఉద్యోగులకు ఏకంగా 43శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. ఆర్టీసీ, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, సింగరేణి సంస్థలో కూడా ఫిట్‌మెంట్ అమలు చేయాలని ఆదేశించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీరించాలని నిర్ణయించారు. బీడీ కార్మికులకు నెలకు రూ.1000 పెన్షన్ ప్రకటించారు. ఆటో డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకొనేందుకు రవాణా పన్నును రద్దు చేశారు. హైదరాబాద్‌లో దాదాపు 700 మంది డ్రైవర్లను టాక్సీలకు ఓనర్లను చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని ఆర్‌ఎంపీ, పీఎంపీల సేవలను గుర్తించి వారికి మరింత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, జర్నలిస్టు సంక్షేమ నిధికి వెంటనే రూ.10 కోట్లు విడుదల చేయడమే కాకుండా దీనిని రూ. వంద కోట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇలా అన్ని రంగాల అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నది ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమేనని కార్మికులు కొనియాడుతున్నారు.