చేసింది చెబుదాం.. దీటుగా ఎదుర్కొందాం..

-ప్రజలంతా మనవెంటే..

-ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం మనదే..

-అసెంబ్లీలో ప్రజాసమస్యలు ప్రస్తావించండి

-మంత్రులు, సభ్యులు పూర్తి అవగాహనతో రండి

-విపక్షాల విమర్శలు సమర్థంగా తిప్పికొట్టండి

-నిరాధార ఆరోపణలు చేస్తే.. నిరూపించాలని డిమాండ్ చేయండి

-టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రంలోని ప్రజలంతా టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, ఉమ్మడి పాలనలో ప్రభుత్వాలకు స్వరాష్ట్రంలో ఉద్యమ నేపథ్యం ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రజల పార్టీ.. ప్రజాపక్షం..ప్రజలకు మంచి చేయడమే తప్ప మనకు మరో లక్ష్యం లేదు అని సీఎం చెప్పారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం ప్రసంగించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ మార్గదర్శనం చేశారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రస్తావించాలని, విపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఆయా అంశాలపై పూర్తి అవగాహనతో సభకు రావాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశించారు. ఎవరైనా తప్పుడు ఆరోపణలకు దిగితే నిరూపించమంటూ గట్టిగా డిమాండ్ చేయాలని అన్నారు. మంత్రులు, స్ట్రాటజీ కమిటీ అలర్ట్‌గా ఉండాలని, రోజువారి అజెండా ఏముంటుందో తెలుసుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. విప్‌లు వారి పనితీరు మెరుగుపరుచుకోవాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో సభకు హాజరయ్యేలా చూడాలని చెప్పారు.

పూర్తిస్థాయిలో సిద్ధంకండి..
అసెంబ్లీలో ఏ అంశంపైన అయినా చర్చకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. పూర్తిస్థాయి అవగాహనతో సభకు రావాలని చెప్పారు. ప్రభుత్వం చర్చకు ఎప్పుడూ సిద్ధమేనని అంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో 17 రోజులు 17 అంశాలపై చర్చించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నది కనుకనే ఏ అంశంపై అయినా ముందుకు వస్తున్నదని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకొనిపోతున్నదని, ఈ సంవత్సరం 19.5 శాతం వృద్ధి రేటు సాధించిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రమూ ఇంత అభివృద్ధి నమోదు చేయలేదని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్లనే ఇది సాధ్యపడిందని అన్నారు. సభలో విపక్ష సభ్యులెవరైనా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే, ఆధారాలు చూపించాలని డిమాండ్ చేయాలని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు. జీరో అవర్‌ను అందరూ సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు.

నిత్యం ప్రజలతో ఉండండి..
సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై తాను నిర్వహించిన సర్వేపై సీఎం మాట్లాడారు. నిత్యం ప్రజలతో ఉన్న వారి గ్రాఫ్ బాగా పెరిగిందని చెప్పారు. సర్వేల్లో 40శాతం కంటే తక్కువ ఉన్నవారు కొంత జాగ్రత్త పడాలని అన్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు వీక్‌గా ఉన్నా అక్కడ పార్టీ బలంగా ఉన్నదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇస్తామని, ఇందులో ఎవరికీ అనుమానం వద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. గత సర్వేలో ఎక్కువ గ్రాఫ్ ఉన్నవారు ఇప్పుడు తగ్గిపోయారని, ఇప్పుడు ఎక్కువ ఉన్నవారు గత సర్వేలో బాగా వెనుకబడి ఉన్నారని ఉదహరించారు. కనుక ఎవరూ బాధపడొద్దు…ఎవరూ సంతోషపడొద్దు.. ప్రతి ఒక్కరూ హుందాగా ఉండాలని అన్నారు. ప్రజలతో నిత్యం ఉన్న వారి గ్రాఫ్ నిలకడగా ఉంటుందన్నారు. సర్వే ఫలితాలే అంతిమం కాదని, ఇది మనను మనం అప్పుడప్పుడు పరీక్షించుకునేది మాత్రమేనని చెప్పారు. మనం సరైన మార్గంలో వెళ్లేందుకు దీన్ని ఉపయోగించుకోవాలని, అందుకే తాను సర్వే చేయించానన్నారు. ఆరునెలల క్రితం కూడా ఒక సర్వే చేయించానని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
జిల్లాలవారీగా సమీక్షలు..
సర్వే ఫలితాలను జిల్లాల వారీగా ముఖ్యమంత్రి స్వయంగా అందించారు. కొన్ని జిల్లాల్లో, కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సర్వేలో కొంత వ్యతిరేకంగా ఉన్నట్టు వచ్చిందని, దీన్ని సరిదిద్దుకోవాలని సూచించారు.

భారీ ఎత్తున సభ్యత్వ నమోదు
టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 15 రోజుల్లో సభ్యత్వ నమోదును పూర్తిచేయాలని, వారం రోజుల్లో తెలంగాణభవన్‌లో సభ్యత్వాల వివరాల క్రోడీకరణ ప్రారంభం అవుతుందని చెప్పారు. రెండుమూడు రోజుల్లో మరోసారి సమావేశమవుదామని, ఆ సమావేశానికి నియోజకవర్గ ఇన్‌చార్జీలు, జిల్లాల మాజీ అధ్యక్షులను కూడా పిలిచి సభ్యత్వ నమోదు పుస్తకాలు అందజేద్దామని అన్నారు. గత సంవత్సరం సభ్యత్వాలను అధిగమించేలా పనిచేయాలని సూచించారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఏప్రిల్ 1నుంచి ఇన్సూరెన్స్ వర్తించేలా చేయాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా దీన్ని పూర్తిచేయాలని సూచించారు. సమావేశానికి రావాలని చెప్పినా కొందరు ఎంపీలు రాలేదని, రాని ఎంపీలకు ఇక్కడి వివరాలను వచ్చినవారు తెలియజేయాలని సూచించారు.ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు వేసిన ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, గంగాధర్‌గౌడ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరిని శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ పరిచయం చేశారు.