చెరువులతోనే జలసిరి

-పునరుద్ధరణతో రైతులకు మేలు
-పూడిక మట్టిని పొలాలకు తరలించుకోవాలి
-మిషన్ కాకతీయలో ప్రజాప్రతినిధులు

Mission Kakatiya programme

చెరువులతోనే గ్రామాల్లో జలసిరి ఉట్టిపడుతుందని, చెరువుల పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతోపాటు భూగర్భ జలాలు కూడా పెంపొంది రైతులకు మేలు జరుగుతుందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం మిషన్ కాకతీయలో భాగంగా పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు చెరువు పనులను ప్రారంభించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తిలో రూ.42 లక్షలతో చేపట్టిన ఊర చెరువు పనులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్యలతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో గ్రామాల్లో చెరువులకు జలసిరి రానుందన్నారు. చెరువుల్లో జలకళ ఉంటేనే గ్రామాలు పసిడి పంటలతో పచ్చదనంతో కళకళలాడుతాయన్నారు.

పూడిక మట్టిని పొలాలకు తరలించుకొని భూముల సారాన్ని పెంచుకోవాలని సూచించారు. ఆంధ్రాపాలకుల వల్ల తెలంగాణలో ఆనాటి సంస్కృతి, చెరువులు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాటి వైభవాన్ని మరోసారి చాటి చెప్పేందుకు మిషన్ కాకతీయను ప్రవేశపెట్టి చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు పార్టీలకతీతంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చింతపల్లి మండలం వర్దమానుగూడెం, రాయినీగూడెం, నెల్వలపల్లి గ్రామాల్లో జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, యాదగిరిగుట్ట మండలంలో మర్రిగూడ చెరువును గొంగిడి మహేందర్‌రెడ్డి, తిప్పర్తిలో కోమటికుంట పనులను టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహరెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్డాపూర్‌లోని పటేల్ కుంటలో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీపీ ముదిగొండ అనీతాశ్రీమరియాదవ్, జెడ్పీటీసీ ఎల్గని చంద్రలింగంగౌడ్‌లతో కలిసి పనులు ప్రారంభించి మాట్లాడారు.

చెరువుల పనులు విజయవంతమయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు. పనులు సక్రమంగా నిర్వహించకుంటే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట మండలం చెల్లంపేటలోని రావికుంటలో పనులను ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం పేట్‌సంగెం, గాంధారి, చిన్నాపూర్, గుర్జల్, జువ్వాడి, ఉత్తనుర్ చెరువుల పనులను ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ ఊర చెరువు పనులను ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, సిరికొండ మండలం తూంపల్లి ఊర చెరువు పనులను జెడ్పీటీసీ ఐతా సుజా ప్రారంభించారు. వరంగల్ జిల్లా రేగొండ మండలం చెన్నాపురంలోని గోవిందప్ప చెరువు పనులను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, పరకాల మండలం వెల్లంపల్లిలోని గుడికుంట పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, హసన్‌పర్తి మండలం సిద్ధాపూర్, అర్వపల్లి చెరువు పనులను ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించారు.