చెరువులకు పూర్వవైభవం

సమైక్య రాష్ట్రంలో చెరువుల్లో ఏనాడు తట్టెడు మట్టి ఎత్తిన పాపానపోలే. చెరువుల పేరు మీద నిధులు మాత్రం ఖర్చు చేసినట్లు లెక్కలైతే చూపించారు. గంగాళంలాంటి చెరువులను తాంబాలంలా మార్చారు అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట, నంగునూరు మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం మాట్లాడారు.

Harish Rao

-సమైక్య పాలనలో తట్టెడు మట్టి ఎత్తిన పాపానపోలే
-గంగాళంలాంటి చెరువులు తాంబాలంలా అయ్యాయి
-పునరుద్ధరణలో మంత్రులు ఒక పూట శ్రమదానం
-ఖాత వలసకుంట లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్రంలోనే మొదటిది
-రాష్ట్రంలో మిల్క్ గ్రిడ్ పథకాలు: భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పూర్వవైభవానికి కృషి చేస్తున్నామని తెలిపారు. చెరువుల మట్టిని రైతులు తమ పంటపొలాల్లో వేసుకోవడంతో అధిక దిగుబడులు వస్తాయని చెప్పారు. ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో మంత్రులం సైతం ఒక పూట శ్రమదానం చేయనున్నట్లు వివరించారు. సమైక్య పాలనలో నంగునూరు మండలంలోని ఖాత వలసకుంట లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నోసార్లు ప్రతిపాదనలు పంపించినా మోక్షం లభించలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖాత లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.8.25 కోట్లు మంజూరు చేశారని, ఇది రాష్ట్రంలోనే మొదటి ప్రాజెక్టు అన్నారు.

దీనిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన జిల్లాల్లో ఎక్కడెక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు అవసరముంటాయో అక్కడ చేపట్టనున్నట్లు వివరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాడిపరిశ్రమను అభివృద్ధి చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. రైతులకు పాడి బర్రెలను సబ్సిడీపై ఇవ్వడానికి మిల్క్ గ్రిడ్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకానికి అర్హులయ్యే రైతులు వారికి నచ్చిన చోట బర్రెలు కానీ, ఆవులు కానీ కొనుగోలు చేసుకునే వెసలుబాటు తమ ప్రభుత్వం కల్పించిందన్నారు.

గతంలో గుజరాత్, కర్ణాటక తదితర ప్రాంతాల్లో తెచ్చుకుంటేనే సబ్సిడీ ఇచ్చే వారని గుర్తుచేశారు. పనిముట్ల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆ రైతుకు తక్షణమే అందజేయడంతోపాటు 50 శాతం సబ్సిడీ వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి పాడిపరిశ్రమ, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహాకాన్ని అందించారన్నా రు.

ప్రభుత్వం విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.4 ఇవ్వడంతోనే అప్రమత్తమైన ప్రైవేట్ సంస్థలు రూ.4 పెంచాయన్నారు. పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు హెరిటెజీ పాల డెయిరీ మాత్రం పైసా కూడా పెంచలేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఎర్రగొల్ల రాజమణిమురళీయాదవ్, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.