చెరువులకు గోదావరి నీళ్లు

– ఎత్తిపోతల ద్వారా ఏడాదిలో రెండుసార్లు నింపుతాం
– ఐదేండ్లలో రెండు పంటలకు సాగునీటి సౌకర్యం
– మూడింతలు పెరుగనున్న ఆయకట్టు విస్తీర్ణం
– భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు

Harish Rao paticipating in Mission Kakatiya programme

సాగునీటి సౌకర్యంలేక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వ్యవసాయరంగాన్ని మిషన్ కాకతీయ, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని భారీనీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనుల నిర్వహణ బాధ్యతను గజ్వేల్ ప్రెస్‌క్లబ్ తీసుకోగా బుధవారం హరీశ్‌రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందిస్తామన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయానికి జీవనాధారమైన చెరువులను విధ్వంసానికి గురిచేశారని, దీంతో ఆయకట్టులో నాల్గో వంతు ఆయకట్టు విస్తీర్ణానికి ఒక పంటకు కూడా సాగునీటి సౌకర్యం సమకూర్చే స్థితిలో చెరువులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. పునరుద్ధరణతో చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం పెంచడంతో ఇప్పుడు అందుబాటులో ఉన్న సాగు విస్తీర్ణం మూడింతలకు పైగా పెరుగుతుందని, భూగర్భజలాలు వృద్ధి చెందితే సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందన్నారు. గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులను ఏడాదిలో రెండు సార్లు నింపుతామని, ఇప్పటికే ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నదని వివరించారు. ఈ పథకం పూర్తయితే స్థానికంగా వర్షాలు కురవకున్నా ఎత్తిపోతల ద్వారా ఏడాదికి రెండు సార్లు చెరువులను నింపడం, తద్వారా రెండు పంటలకు సమృద్ధిగా నీరందించడంతో పల్లెలు పచ్చగా మారుతాయన్నారు.
జిల్లాలో తడ్కపల్లి, తిప్పారం, పాములపర్తి గ్రామాల్లో రిజర్వాయర్లను నిర్మించి గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లోని చెరువుల్లో నీరు నింపుతామన్నారు. ఈ క్రమంలోనే ఆయా చెరువుల కట్ట కాల్వలు, పంట కాల్వలను సైతం పునరుద్ధరిస్తున్నామని వివరించారు. మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నదన్నారు. వివిధ వర్గాలు, పారిశ్రామిక వేత్తలు చెరువుల పునరుద్ధరణ పనులను దత్తత తీసుకోవడం, విరాళాలు అందించడం శుభపరిణామమన్నారు. గతంలో కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వాలు పనులకు నిధులు కేటాయిస్తే, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అభివృద్ధి పనులను చేపడుతున్నారన్నారు. గత రెండు రోజులుగా అహ్మదీపూర్ పెద్ద చెరువు పనుల్లో ప్రజలను భాగస్వాములను చేస్తున్న గజ్వేల్ ప్రెస్‌క్లబ్ జర్నలిస్టుల కృషి అభినందనీయమని, మిషన్ కాకతీయ పనుల్లో గజ్వేల్ జర్నలిస్టులు భాగస్వాములై రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులు గజ్వేల్ ప్రెస్‌క్లబ్ జర్నలిస్టులు, సంబందిత అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతాయని మంత్రి ప్రకటించారు. ఈ బృహత్కర కార్యక్రమం విజయవంతానికి అన్ని వర్గాలు కలిసి రావాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జ, గడా ఓఎస్డీ హన్మంతరావు, టీఎస్‌డబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు విరాహత్‌అలీ, గజ్వేల్ ప్రెస్‌క్లబ్ కన్వీనర్ ఎల్లారెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.