చెరువుల లెక్కలు తీయండి

-మూడురోజుల్లో సమగ్ర సమాచారం కావాలె
-నీటిపారుదల శాఖ సమీక్షలో ఆదేశించిన సీఎం కేసీఆర్
-22న చిన్న నీటిపారుదల శాఖాధికారులతో సమావేశం

KCR-016

రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయో లెక్కలు తీయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. మొత్తం పది జిల్లాల్లో ఎన్ని చెరువులు సజీవంగా ఉన్నాయి? ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి? ఆయకట్టు ఎంత? అనే వివరాలను సమగ్రంగా తనకు అందించాలని సూచించారు. నీటిపారుదలశాఖపై ముఖ్యమంత్రి సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితాసబర్వాల్, ఈఎన్‌ఎసీలు మురళీధర్‌రావు, విజయ ప్రకాష్, చీఫ్ ఇంజినీర్ (మైనర్ ఇరిగేషన్) రామకృష్ణారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో మొత్తం 36 వేల చెరువులు ఉన్నాయని, వాటి కింద 20 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వీటిని పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్..

శుక్రవారం నుంచి గణాంకాల వివరాలను సేకరించే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. చిన్ననీటిపారుదలశాఖ సిబ్బంది మొత్తం క్షేత్రస్థాయికి వెళ్లి ఎన్ని చెరువులు ఉన్నాయి? ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటి? మరమ్మతు కోసం ఎలాంటి పనులు చేపట్టాలి? వంటి వివరాలను ఈనెల 21వ తేదీలోగా ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. 22వ తేదీన హైదరాబాద్‌లో చిన్ననీటిపారుదలశాఖ అధికారులతో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై చెరువుల పునరుద్ధరణకు ఏం చేయాలన్న విషయాలపై చర్చించనున్నారు.