చెరువుల దీక్ష చేపట్టాం

-బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం
-కన్నతల్లివంటి చెరువులతోనే గ్రామాల్లో బతుకుదెరువు
-కాంగ్రెస్ హయాంలో కాంట్రాక్టర్లు జేబులు నింపుకొన్నారు
-పనుల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి: మంత్రి హరీశ్‌రావు

బీడు భూములన్నీ సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలి.
మన ఊరు-మన చెరువు అనే భావనతో రాష్ట్ర వ్యాప్త్తంగా రూ.2 వేల కోట్ల వ్యయంతో చెరువుల దీక్ష చేపట్టాం. ఈ మహోత్తర కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హారీశ్‌రావు కోరారు. శుక్రవారం మెదక్ జిల్లా అందోలు నియోజకవర్గంలోని రాంసానిపల్లి, కాదులూర్ గ్రామాల్లోని చెరువులకు భూమిపూజ చేసి, మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. చెరువు వద్ద ఏర్పాటు బహిరంగసభల్లో ప్రసంగించారు.

Harish Rao participated in Mission Kakatiya programme

గతంలో గంగాళంలా ఉన్న చెరువులు ఇప్పుడు తాంబాళంలా మారాయన్నారు. వాటిలో పూడికను తీసి జలకళగా తేవడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. చెరువు కన్నతల్లి వంటిదని, చెరువు ఉంటనే బతుకుదెరువు ఉంటుందన్నారు. సంస్కృతికి కేంద్రం చెరువని అభివర్ణించారు. 50 ఏండ్లుగా చెరువుల్లో పూడిక పనులను చేపట్టకపోవడంతో చెరువులు కళ తప్పాయన్నారు. చెరువులను మెరుగుపరచడం ద్వారా ఆయకట్టు రైతులు ఎండకాలంలోనూ సాగుచేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.

చెరువు మట్టిని పొలాల్లో వేయడంతో భూములు సారవంతమై, రసాయన ఎరువుల వాడకం తగ్గి దిగుబడి అధికంగా వస్తుందన్నారు. చెరువు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నాణ్యతగా జరిగేలా చూస్తామని, నాణ్యత లేకుంటే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎండకాలంలో నిరంతరంగా 9 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ అందిస్తామన్నారు.

గత ప్రభుత్వాల మాదిరిగా 6 గంటల విద్యుత్, గంట గంటకు ట్రిప్ కావడంతో రైతులు పంటలను పండించలేకపోయారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించే విద్యుత్ పగటి పూట ఉదయం నుంచి సాయంత్రం వరకు 6 గంటలపాటు అందిస్తామన్నారు. పరిశ్రమలకు ఒక్కరోజు కుడా కరెంట్‌ను నిలిపివేయడం ఉండదన్నారు. కాంగ్రెస్ హయాంలో పూడిక పేరుతో పనులు చేపట్టకుండానే కాంట్రాక్టర్లు, నాయకులు ప్రజాధనాన్ని దండుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల కోసం పనిచేస్తూ, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, ప్రజల కడుపు నింపుతున్నదన్నారు.

మిషన్‌కాకతీయకు భారీగా విరాళాలు
మిషన్ కాకతీయకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక నెల వేతనాన్ని కలిపి రూ.63 లక్షలను విరాళంగా అందించారని మంత్రి తెలిపారు. చిన్నకోడూర్ మండలంలోని సర్పంచ్‌లు నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారని, మెదక్ జిల్లా పోలీస్‌శాఖ కూడా ఒక చెరువును దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఐకేపీ మహిళా సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు చెరువు వద్ద కూలీలుగా పనిచేస్తామని తెలపడం హర్షణీయమన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని హర్షం వ్యక్తంచేశారు.