Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చెంచుల అభివృద్ధే ధ్యేయం

-నెలకోసారి కాలనీలో నిమ్స్ డాక్టర్లతో వైద్యశిబిరం
-స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
-75 చెంచు కుటుంబాలకు టీవీల అందజేత

Madhusudhana Chary

నాగరికతకు దూరంగా ఉన్న చెంచులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, ఇకపై నెలకోసారి నిమ్స్ డాక్టర్లతో వైద్య శిబిరం ఏర్పాటు చేయించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తామని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రేగొండ మండలం చెన్నాపురం శివారు చెంచుకాలనీలో అక్కడివారితోపాటు చిట్యాల మండలం బావుసింగ్‌పల్లికి చెందిన చెంచుల కోసం నిమ్స్ డాక్టర్లతో వైద్యశిబిరం ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా 75 కుటుంబాలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి అరవై ఏండ్లు దాటినా నేటికీ చెంచుల జీవనం దుర్భరంగా ఉందన్నారు. పల్లెనిద్రలో భాగంగా తాను చెంచుకాలనీలో బసచేసినప్పుడు వారి స్థితిగతులను చూసి చలించిపోయానని, వారిని నాగరికతవైపు మల్లించాలనే ఆలోచన ఆనాడే వచ్చిందని చెప్పారు. ఇందులో భాగంగానే తాను స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టగానే తొలుత చెంచుకాలనీని సందర్శించి వారికి బట్టలు తదితర వస్తువులు అందజేయడమే కాకుండా కాలనీ దాటని వారిని ఇటీవల వరంగల్‌లోని చారిత్రాత్మక ప్రదేశాలతోపాటు శ్రీరామరాజ్యం సినిమా చూపించినట్లు తెలిపారు. అప్పుడు వారి కళ్లలో చూసిన ఆనందం ఎంతో అపురూపమైందన్నారు.

రానున్న ఐదేండ్లలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న చెంచులకు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారికి పౌష్టికాహారం అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రంతోపాటు ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. పిల్లలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లేందుకు గాను వారికి ఇంగ్లిష్ నేర్పించనున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు కుటుంబానికో టీవీ ఇచ్చామని, కేబుల్ ఏర్పాట్లు కూడా చేస్తానన్నారు. హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి సహకారంతో టీవీలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారుల విభజన పూర్తయిన తర్వాత అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో మొదలవుతాయని తెలిపారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇంతకాలం పదవులను అడ్డంపెట్టుకుని కాలం వెళ్లదీసిన వారు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ఆర్‌డీ డాక్టర్ సాంబశివరావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, కుంచాల సదావిజయ్‌కుమార్, పోలెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పున్నం రవి, మోడెం ఉమేశ్, బలేరావు మనోహర్‌రావు, మైస భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్పీకర్‌ను చెంచులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

Every contribution that you make can make a difference.

Please contribute generously to the TRS.

MAKE A DONATION NOW