చంద్రబాబు రాజకీయ శిఖండి

-తెలంగాణలో బీజేపీని దెబ్బతీయటమే ఆయన లక్ష్యం
-టీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి కేటీఆర్

KTR Election Campaign

మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలిపే సత్తాలేక బలవంతంగా బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దింపి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సమైక్యవాదంతో దోషిగా మిగిలిన ఆయన, తన పాపాన్ని బీజేపీకి అంటగడుతున్నారని విమర్శించారు.

తెలంగాణలో బీజేపీని దెబ్బతీయాలన్నదే బాబు లక్ష్యమని పేర్కొన్నారు. బాబు, వెంకయ్యనాయుడు, పవన్‌లాంటి వాళ్లు నోట్ల కట్టలు పంపినా జగ్గారెడ్డికి డిపాజిట్ దక్కదని స్పష్టం చేశారు. తెలంగాణ అభ్యర్థులను ఆంధ్రా నాయకులు ఖరారు చేసే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ ప్రజలకు పట్టుకోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి తెలంగాణ తమవల్లే వచ్చిందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

ఎంతో మంది ప్రాణత్యాగాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వందరోజుల పాలనపై రాష్ట్ర ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని, ఇప్పటికే అనేక ప్రజారంజక పథకాలకు రూపకల్పన చేసిన ప్రభుత్వం అందుకు పునాదులు కూడా వేసిందన్నారు. పచారంలో మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే హన్మంతు షిండె, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, రఘుపతిరావు, మాజీ మంత్రి ఎన్‌కే కృష్ణ తదితరులు పాల్గొన్నారు.