సిమెంట్ సంక్షోభానికి సీఎం చొరవతో తెర

– ధరల తగ్గింపునకు సిమెంట్ ఉత్పత్తిదారుల అంగీకారం
– బస్తాకు రూ.20 నుంచి రూ.25 వరకు తగ్గిస్తూ నిర్ణయం
– ఉత్పత్తిదారులు, బిల్డర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం

KCR
నెలరోజులుగా సిమెంట్ రంగంలో నెలకొన్న సంక్షోభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చొరవతో తెరపడింది. సిమెంటు పరిశ్రమలో నెలకొన్న సంక్షోభంతో ఉత్పత్తిదారులు ధరలు పెంచడం, దీంతో నిర్మాణరంగం తీవ్ర ప్రభావం చూపడంతో కొద్దిరోజులుగా రాష్ట్రంలో నిర్మాణరంగం పూర్తిగా కుదేలైంది. ధరలు తగ్గించాలని బిల్డర్లు, కుదరదంటూ ఉత్పత్తిదారులు పట్టుబట్టడంతో సమస్యకు పీటముడి పడింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని సిమెంట్ ఉత్పత్తిదారులు, బిల్డర్లతో చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌కే జోషీలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సిమెంటు ధరలు బస్తాకు రూ.20 నుంచి 25 వరకు తగ్గించేందుకు కంపెనీలు అంగీకరించాయి. బ్రాండ్, క్వాలిటీని బట్టి ధరల నిర్ణయానికి సిమెంట్ కంపెనీల యజమాన్యాలు, బిల్డర్లు అంగీకరించారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఇరు వర్గాలు వారి వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ధరల పెంపు వల్ల నిర్మాణ రంగం దారుణంగా దెబ్బతింటుందని బిల్డర్లు, ముడి సరుకుల ధరల రెట్టింపైన నేపథ్యంలో ఏడాదిగా నష్టాల్లో ఉన్నామని కంపెనీ యజమానులు వాపోయారు. ఈ సందర్భంగా ఇతర రాష్ర్టాల్లోని ధరల వివరాలను సైతం వారు అధికారులు, బిల్డర్ల ముందు ఉంచారు.

ఇబ్బందులు ఉన్నా.. మొండి వైఖరితో సమస్యను పరిష్కరించుకోకపోతే.. ఇరు వర్గాలు దెబ్బతింటాయని అధికారులు నచ్చజెప్పడంతో కంపెనీల యజమానులు, బిల్డర్లు ధరల తగ్గింపునకు అంగీకరించారు. సమస్య పరిష్కారానికి తెలంగాణ సీఎం చొరవే కారణమని బిల్డర్లు, సిమెంట్ ఉత్పత్తిదారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల ప్రతినిధులు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్‌రెడ్డి, హైదరాబాద్ చాప్టర్ అధ్యక్ష కార్యదర్శులు జేవీ రెడ్డి, ఎస్ రాంరెడ్డి, తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ప్రభాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం వల్లే తమ సమస్య పరిష్కారమైందన్నారు.

ఈ క్రెడిట్ పూర్తిగా సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ర్టాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ధరల తగ్గింపునకు అంగీకరించిన సిమెంటు కంపెనీలను అభినందించారు. గురువారం నుంచి సిమెంటు యథావిధిగా కొనుగోళ్లను చేపడుతామని ప్రకటించారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా ఇరువర్గాలు సామరస్యపూర్వకంగా చర్చించుకుంటామని తెలిపారు. సిమెంటు కంపెనీ యాజమాన్యాల తరపున ఆనంద్‌రెడ్డి, సాంబశివరావు తదితరులు మాట్లాడుతూ.. ధరల తగ్గింపులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ప్రభుత్వ చొరవతోనే సహకరించామన్నారు.

ముడిసరుకుల ధరల పెరుగుదల వల్ల తామెంతగా నష్టపోయామో సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారని తెలిపారు. పారిశ్రామిక పాలసీని రూపొందించడంలోనూ తనదైన మార్కును చూపిస్తున్నారన్నారు. ఇరువర్గాలతో చర్చించడం వల్లనే సమస్య పరిష్కారమైందని పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర టీ మీడియాతో అన్నారు.