కారు స్పీడుపెంచిన కేసీఆర్

-గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం
-పార్టీ మ్యానిఫెస్టో అమలు.. భవిష్యత్‌పై కార్యాచరణ
-ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా జవాబు
-ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచిన టీఆర్‌ఎస్ అధినేత

KCR-in-Party-Meeting
తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. కార్యకర్తల్లో ఉత్సాహం.. నమ్ముకున్న ప్రజలకు బంగారు తెలంగాణ సాధిస్తామన్న భరోసా.. ప్రతి చిన్న విషయాన్నీ రాద్దాంతం చేస్తున్న ప్రతిపక్షాలకు దీటైన జవాబు చెప్తూ కేసీఆర్ ప్రసంగం సాగింది. కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు.

తెలంగాణ గత చేదు అనుభవాలు మొదలు… ఉద్యమంలోని పలు కీలక పరిణామాలను గుర్తు చేశారు. తెలంగాణ మహనీయులను కొనియాడుతూ… సమైక్య పాలకుల విధ్వంసాన్నీ సమావేశం ముందుంచారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతి క్షణం తెలంగాణ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నామనే అంశాలను వివరించారు. మ్యానిఫెస్టో అమలుకు ఎలాంటి కసరత్తు చేస్తున్నాం.. మరెలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయి.. వాటినెలా అధిగమిస్తున్నామో సవివరంగా ప్రజల ముందుంచారు. ఇప్పటివరకూ చేపట్టిన వాటర్ గ్రిడ్.. హరితహారం.. గిరిజనులకూ మూడెకరాల భూపంపిణీలాంటి బృహత్తర పథకాలతోపాటు రానున్న నాలుగేండ్లలో అమలు చేయనున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.

ప్రజలకు టీఆర్‌ఎస్ సర్కారుపై మరింత భరోసా కలిగేలా ఆయన ప్రసంగం సాగింది. నాలుగేండ్ల తర్వాత ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని వీధుల్లో కనిపించడానికి వీల్లేదు అంటూ ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టంగా తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఎలాంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామో వివరించారు. ఒక్క జీవోతో రూ.4,250 కోట్లు మంజూరు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉందా అని సవాలు విసిరారు.

ఆశావహులకు తీపికబురు: సీఎం అయిన తర్వాత తొలిసారి తెలంగాణభవన్‌లో కలుసుకున్న పార్టీ ఆత్మీయులకు సమీప భవిష్యత్తులోనే మంచి అవకాశాలుంటాయని తీపి కబురును అందించారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను వజ్రపు తునకలుగా అభివర్ణించిన గులాబీ నేత… వారి వల్లే పార్టీ నిలబడిందని, వారి చెమట చుక్కలతోనే ఈ పదవులు వచ్చాయని చెప్పారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 30-40 మంది చొప్పున నాలుగు వేల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తానని వారిలో నూతనోత్తేజాన్ని నింపారు.

ఇన్నాళ్లూ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కేసీఆర్.. తాజాగా పార్టీపైనా ప్రత్యేక దృష్టిసారించారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీని ఘనంగా జరుపుకునేందుకు కార్యాచరణ ప్రకటించారు. ప్రతి నియోజకర్గం నుంచి ప్రతినిధులను ఆహ్వానించి… వారితో చర్చిస్తానని తెలిపారు. సభ్యత్వ నమోదు… గ్రామస్థాయి మొదలు జిల్లా కమిటీల వరకు పార్టీ నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికీ త్వరలోనే శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.