కారు జోరు

-11 స్థానాలు గెలువనున్న టీఆర్‌ఎస్
-33 శాతం ఓటర్లు గులాబీ పక్షంreport

రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కారుదే జోరని మరోసారి సర్వేలు పేర్కొన్నాయి. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్ 11 స్థానాలు గెల్చుకుంటుందని హన్సా రిసెర్చ్ గ్రూప్‌తో కలిసి ఎన్డీటీవీ నిర్వహించిన పోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందుతుందని పేర్కొంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రెండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో మెజార్టీ ఓటర్లు ఆ పార్టీవైపే చూస్తున్నారని సర్వే ఫలితాలనుబట్టి తెలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 9 స్థానాలు అదనంగా లభిస్తాయని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 2009 ఎన్నికలతో పోల్చితే ఏడు స్థానాలు కోల్పోయి.. ఐదు స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది.

తెలంగాణలో టీడీపీ దారుణ పరాభవం చవి చూడక తప్పదని స్పష్టమవుతున్నది. ఈ పార్టీకి ఒక్క సీటు కూడా లభించే అవకాశాల్లేవని సర్వే తేల్చింది. ఓట్లశాతాన్ని బట్టి చూస్తే టీఆర్‌ఎస్‌కు 33శాతం వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 27%, బీజేపీకి 15%, టీడీపీకి 8%, ఇతరులకు 17శాతం లభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.