కారెక్కిన ఎంపీపీలు

-కార్పొరేషన్, మున్సిపాలిటీల తొవ్వలోనే మండలాలు
-204 మండల పరిషత్‌లలో టీఆర్‌ఎస్ జయకేతనం
-112 ఎంపీపీలను దక్కించుకున్న కాంగ్రెస్
-టీడీపీ: 34 బీజేపీ: 9 వామపక్షాలు: 3 ఇతరులు: 10
-25 మండల పరిషత్‌ల ఎన్నికలు నేటికి వాయిదా

KCRటీఆర్‌ఎస్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థాయుల్లోనూ విజయకేతనం ఎగురవేస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్నది. గురువారం కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో జోరు కనబరిచిన టీఆర్‌ఎస్ శుక్రవారం మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ మెంబర్ల ఎన్నికల్లోనూ తన సత్తాను చాటింది. మెజారిటీ పరిషత్‌లలో గులాబీ గుబాళించింది.

మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవులకు ఎన్నికలు నిర్వహించగా అందులో 25 కోరం లేక శనివారానికి వాయిదా పడ్డాయి. మిగతావాటిలో అధికార టీఆర్‌ఎస్ 204 గెలుచుకుని ఆధిక్యతను చాటింది. కాంగ్రెస్ పార్టీ 112 పదవులను దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీకి 34 లభించాయి. మిగతాపార్టీలు నామమాత్రంగా గెలుపొందాయి. బీజేపీ తొమ్మిది చోట్ల, వామపక్షాలు మూడు చోట్ల, ఇతరులు 10 చోట్ల అధ్యక్ష స్థానాలను దక్కించుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ దాదాపు 30 పరిషత్‌లను టీఆర్‌ఎస్ సహకారం వల్లే గెలుచుకోగలిగాయి. ఆ స్థానాల్లో ఎన్నికైనవారు టీఆర్‌ఎస్ మద్దతుదారులే. తెలంగాణలోని తొమ్మిది జిల్లాల పరిధిలో ఉన్న 443 ఎంపీపీ స్థానాలకుగాను ఖమ్మం జిల్లాలోని 46 మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ మెంబర్ల ఎన్నిక వాయిదా పడింది.

దీంతో 8 జిల్లాల పరిధిలో 397 మండల పరిషత్‌లకు మాత్రమే జిల్లా ఎన్నికల అధికారులు నోటీసులు జారీచేసి శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 10 గంటలలోపు మండల పరిషత్, జిల్లా పరిషత్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్లను పరిశీలించిన అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ మెంబర్ల ఎన్నికకు ఆయా మండల పరిషత్‌లలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా ఎంపీపీ, వైస్ ప్రెసిడెంట్లను ఎన్నుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నిక ముగిసింది. పరిషత్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది. నల్లగొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ తన పట్టును నిలబెట్టుకుంది. వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు పోటాపోటీ పడ్డాయి. ఈ జిల్లాల్లో కూడా అధికార పార్టీ ఒక ఎంపీపీ పదవిని అధికంగానే పొందింది.

ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 52 ఎంపీపీ పదవులకు టీఆర్‌ఎస్ 42, కాంగ్రెస్ 4, టీడీపీ 5, ఇతరులు ఒకటి దక్కించుకోగా మరొకటి వాయిదా పడింది. కరీంనగర్‌లోని 57 మండల పరిషత్‌ల్లో టీఆర్‌ఎస్ 41, కాంగ్రెస్ 10, బీజేపీ 1, సీపీఐ 1, ఇతరులు 2 గెలుపొందగా రెండుచోట్ల కోరం లేక ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. నిజామాబాద్ జిల్లాలోని 36 ఎంపీపీ పదవుల్లో టీఆర్‌ఎస్ 24, కాంగ్రెస్ 11 దక్కించుకున్నాయి.

ఒకచోట వాయిదా పడింది. మెదక్ జిల్లాలోని 46 మండల పరిషత్తుల్లో టీఆర్‌ఎస్ 28, కాంగ్రెస్ 15, టీడీపీ 1, ఇతరులు 1 గెలుపొందారు. మరోస్థానంలో ఎన్నిక వాయిదా పడింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని 64 ఎంపీపీ పదవుల్లో టీఆర్‌ఎస్ 29, కాంగ్రెస్ 17, టీడీపీ 10, బీజేపీ 5 గెలుపొందగా మూడుచోట్ల ఎన్నిక వాయిదా వేశారు. నల్లగొండ జిల్లాలోని 59 మండల పరిషత్‌లలో టీఆర్‌ఎస్ 12, కాంగ్రెస్ 28, టీడీపీ 6, వామపక్షాలు 2, బీజేపీ 1 దక్కించుకున్నాయి. నాలుగుచోట్ల ఇతరులు గెలుపొందారు.

కోరం లేకపోవడంతో మరో ఆరుచోట్ల ఎన్నికలు శనివారానికి వాయిదా పడ్డాయి. వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఎంపీపీ స్థానాలను దక్కించుకున్నాయి. ఈ జిల్లాలో ఉన్న 50 ఎంపీపీ పదవుల్లో టీఆర్‌ఎస్ 16, కాంగ్రెస్ 17, టీడీపీ 7 దక్కించుకున్నాయి. ఇతరులు రెండుచోట్ల గెలుపొందారు. ఎనిమిదిచోట్ల ఎన్నిక వాయిదా వేశారు. రంగారెడ్డి జిల్లాలోని 33 స్థానాల్లో టీఆర్‌ఎస్-12, కాంగ్రెస్-11, టీడీపీ-5, బీజేపీ-2 స్థానాలను దక్కించుకొంది. మరో 3స్థానాల్లో కోరం లేక పోవడంతో ఎన్నికను అధికారులు శనివారానికి వాయిదా వేశారు.