బడ్జెట్‌లో విద్య.. వైద్యానికి పెద్దపీట

-హెల్త్ యూనివర్సిటీ.. ఉత్తర తెలంగాణకు వరం
-మూడేండ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం
– రైతు ఆత్మహత్యల పాపం టీడీపీ, కాంగ్రెస్‌లదే
– పొన్నాలవి నంగనాచి మాటలు: మంత్రి ఈటెల

Etela Rajendar

ఉత్తర తెలంగాణకు వరంగల్ కేంద్రం. ఇక్కడ కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం దవాఖాన ఉన్నాయి. ఇక్కడే హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సమంజసం. సీఎం కేసీఆర్ వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ఉత్తర తెలంగాణకు వరం. బడ్జెట్‌లో వైద్యం,విద్యారంగాలకు పెద్దపీట వేస్తాంఅని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పా రు.

శుక్రవారం జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆయన హన్మకొండ వచ్చారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటివద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణలో రూ.3376.27 కోట్ల రుణాలు మాఫీ చేస్తే హర్షించామన్నారు. రాష్ట్రంలో 17వేల కోట్ల రూపాయలు మాఫీ అవుతున్నాయని, తొలి విడతగా 4250 కోట్ల మాఫీ చేశామన్నారు.పొన్నాల లక్ష్మయ్య నంగనాచి మాటలు మాట్లాడుతుండు.. ఏనాడైనా రైతు సంక్షేమం గురించి పట్టించుకున్నాడా? కరెంటు కోతలకు, రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్, టీడీపీలే కార ణం.

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తెలంగాణలో ఏర్పాటుకాకుండా సీమాంధ్రలో ఏర్పాటు చేసి కరెంటు లేకుండా చేశాయి. ఎస్సారెస్పీ ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరందుతుందని అసెంబ్లీలో పొన్నాలను ప్రశ్నిస్తే, 14లక్షల 70వేల ఎకరాలకు అందిస్తున్నామని తప్పుడు లెక్కలతో మోసపుచ్చిండు. వాస్తవానికి ఐదు లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతున్నదిఅని మండిపడ్డారు. బడ్జెట్‌లో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామన్నారు.

జూరాల-పాకాల నీటితో సస్యశ్యామలం : జూరాల- పాకాల ప్రాజెక్టుతో ఆరు నియోజకవర్గాలు సస్యశ్యామలమవుతాయని ఈటెల రాజేందర్ చెప్పారు. పాకాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీడు భూములను సాగులోకి తేవడంపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారని, 36 వేల గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించే ప్రణాళికలను రూపొందించామన్నారు. కృష్ణానీటిని జూరాల ప్రాజెక్టు నుంచి పాకాల చెరువులోకి గ్రావిటీ ద్వారా తీసుకొస్తామన్నారు. ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే కరువు ఉండదన్నారు. సమావేశాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.