బ్రాండ్ ఇమేజ్ కాపాడుకుందాం

-ఇంజినీరింగ్ హబ్ పేరును సార్థకం చేయండి
-ఇతర రాష్ట్ర విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్లు
-సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రభుత్వం
-రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్ష

KCR 0021

హైదరాబాద్‌కు ఉన్న ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ హబ్ పేరును కాపాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. చాలా కాలేజీల్లో సీట్లు నిండకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, మిగిలిపోయిన సీట్లను కౌన్సెలింగ్ తర్వాత కన్వీనర్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.

ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి అధికారులతో ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియపై సీఎం కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్లు ఇతర రాష్ర్టాల విద్యార్థులకు కేటాయించడంపై సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని, ఇందుకు కావాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలని విద్యాశాఖ అధికారులకు సీఎం సూచించారు.

ఎంసెట్ పరీక్షా ఫలితాలు వెల్లడయిన నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ వేగంగా, సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ప్రవేశపరీక్షల నిర్వహణపై ఇరు రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులు, అధికారులు చర్చించి నిర్ణయం తీసుకుంటారని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. రెండు రాష్ర్టాల్లో అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ వ్యవహారాలను చూసే ఏఎఫ్‌ఆర్సీ విభజనకు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌ను కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంపై ఫీజు రీయింబర్స్‌మెంట్ భారం ఎంత పడుతుందన్న అంశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. మరో నాలుగురోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం కార్యాలయం మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.