భూసేకరణను వేగవంతం చేయండి

-ఖరీఫ్‌నాటికి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి
-డిసెంబర్‌లో చెరువుల పునరుద్ధరణ వారోత్సవాలు
-నీటిపారుదల సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

కేంద్రం కొత్త పునరావాస చట్టం ప్రవేశపెట్టిన తర్వాత ప్రాజెక్టులకు భూసేకరణ ఆగిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే భూసేకరణ వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టులకు సంబంధించి సచివాలయంలో సాగునీటిశాఖ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మంగళవారం సమీక్షించారు. 2015-16 ఖరీఫ్ కాలానికి నీటిని ఇవ్వగలిగే ప్రాజెక్టుల్లో చిన్న మొత్తంలో భూసేకరణ చేయాల్సి ఉందని, వాటిని సేకరించి నీరు ఇవ్వగలిగితే వచ్చే ఏడాది ఖరీఫ్‌లో వివిధ ప్రాజెక్టుల కింద సుమారు ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించొచ్చని సూచించారు.

Irrigation Minister Harish Rao in Review Meeting

వివిధ జిల్లాల్లో మొత్తం అన్ని ప్రాజెక్టులు కలుపుకుని భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల్లో సేకరించాల్సిన భూమి 87,353 ఎకరాలుగా ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. భూసేకరణలో పాత చట్టంలో నిర్ధేశించిన పద్ధతినే అనుసరిస్తూ కొత్త చట్టం ప్రకారం అవార్డు ప్రకటించడానికి (1+1) నిర్వాసితులను ఒప్పించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రస్తుత, భవిష్యత్ భూసేకరణ అవసరాలకు అనుగుణంగా ఎస్డీసీ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలను సిద్ధంచేయాలని పునరావాస కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరడానికి స్పెషల్ కలెక్టర్లు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. ఖమ్మంజిల్లాలో ఎన్టీఆర్ కాలువ ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌ను త్వరతగతిన పూర్తి చేసి, పాత కాలువను తమకు అప్పగిస్తే అక్కడున్న బొగ్గు నిక్షేపాలను వెలికితీయడానికి ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నామని సింగరేణి ఎండీ సుతీర్థ భట్టాచర్య చెప్పారు.

దీనిపై రెండువారాల్లో నివేదిక అందించాలని చీఫ్ ఇంజినీర్‌లు, సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావును మంత్రి ఆదేశించారు. సీఎం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చెరువుల పునరుద్ధరణపైనా హరీశ్ సమీక్షించారు. పునరుద్ధరణ అంచనాల తయారీకి మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలన్నారు. మొదటి దశలో ఎంపిక చేసుకున్న చెరువుల్లో పనులను వెంటనే చేపట్టాలని, మండల, అసెంబ్లీ, జిల్లా వారీగా జాబితాను అక్టోబర్ 20వ తేదీలోగా పంపాలని, డిసెంబర్ మొదటి వారంలో చెరువుల పునరుద్ధరణ వారోత్సవానికి సాగునీటిశాఖ సిద్ధం కావాలని మంత్రి సూచించారు.

సమావేశంలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి మీనా, పునరావాస కమిషనర్ శ్రీదేవి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, సింగరేణి ఎండీ సుతీర్ధ భట్టాచార్య, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.