బీహెచ్‌ఈఎల్‌కు 2 పవర్ ప్రాజెక్టులు

– కొత్తగూడెం, మణుగూరు ప్రాజెక్టులపై ఎంవోయూకు సీఎం కేసీఆర్ అనుమతి
– మూడేండ్లలో పూర్తిచేయాలని ఆదేశం

CM KCR with BHEL MD

రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం పారదర్శకంగా, లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వచ్చే మూడేండ్లలో ఆరువేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యతను తెలంగాణ జెన్‌కోకు అప్పగించిన ఆయన, ప్రాజెక్టుల ఒప్పందాలు, పనుల ప్రారంభంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగూడెం (800మెగావాట్లు), మణుగూరు (1080 మెగావాట్లు) విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగూడెం ప్రాజెక్టు నిర్మాణానికి రూ,5,200కోట్లు, మణుగూరు ప్రాజెక్టుకు రూ.6,500కోట్ల వ్యయం అవుతుందని అంచనావేశారు. మంగళవారం మధ్యాహ్నం బీహెచ్‌ఈఎల్ సీఎండీ బీపీ రావు, డైరెక్టర్ అతుల్‌సోక్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు గోపాలకృష్ణ, శ్రీరాంతోపాటు టీఎస్‌జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. బీహెచ్‌ఈఎల్ సీఎండీ బీపీరావు ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించి మెమొంటోను అందజేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం, మణుగూరులో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించారు. తెలంగాణలో విద్యుత్‌కొరతను అధిగమించేందుకు కొత్త పవర్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో విశేష అనుభవం, అపార నైపుణ్యం కలిగిన బీహెచ్‌ఈఎల్ వీటిని త్వరితగతిన పూర్తిచేస్తుందని సీఎం విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులు వెంటనే మొదలుపెట్టేందుకు వీలుగా అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకొనేందుకు అనుమతించారు. మణుగూరు ప్రాజెక్టును 24 నెలల్లో, కొత్తగూడెం సూపర్ క్రిటికల్ థర్మల్‌పవర్ స్టేషన్‌ను 36 నెలల్లో పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. కొత్తగూడెం ప్రాజెక్టు నిర్మాణానికి 48నెలలు గడువు ఇవ్వాలని బీహెచ్‌ఈఎల్ ప్రతినిధులు కోరగా అందుకు సీఎం నిరాకరించారు. వారంలోగా ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో భూపరీక్షలు పూర్తిచేయాలని బీహెచ్‌ఈఎల్ నిర్ణయించింది.