బంగారుబాటకు భారీ పద్దు , ప్రాధాన్యరంగాలకు సముచిత కేటాయింపులు

 

Budget

-ప్రాధాన్యరంగాలకు సముచిత కేటాయింపులు
-రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం.. తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటెల

వడ్డింపుల్లేని వరాల బడ్జెట్
-వార్షిక బడ్జెట్: రూ.1,15,689 కోట్లు
-ప్రణాళిక వ్యయం: రూ.52,383 కోట్లు
-ప్రణాళికేతర వ్యయం: రూ.63,306 కోట్లు
-ఆర్థిక మిగులు: రూ.531 కోట్లు
-జీఎస్‌డీపీ ద్రవ్యలోటు: రూ.16,969 కోట్లు
-జీఎస్‌డీపీ ద్రవ్యలోటు శాతం: 3.49%

పెరిగిన ప్రణాళికేతర వ్యయం
-కేంద్రంనుంచి తగ్గిన పన్ను ఆదాయం
-అయినా కేటాయింపులపై వెనుకంజలేదు
-సంక్షేమానికి టీఆర్‌ఎస్ సర్కార్ పెద్దపీట
– ఎస్సీ సంక్షేమానికి రూ.5,547 కోట్లు
– ఉప ప్రణాళికకు రూ.8,089 కోట్లు
– గిరిజన సంక్షేమానికి రూ.2,878 కోట్లు
– బీసీ సంక్షేమానికి రూ.2,172 కోట్లు
– మైనారిటీ సంక్షేమానికి రూ.1,105 కోట్లు
– ఆసరాకు రూ.4,000 కోట్లు

ప్రధాన రంగాలు..కేటాయింపులు
-మిషన్ కాకతీయ, చిన్ననీటిపారుదలకు 2083 కోట్లు
-వాటర్‌గ్రిడ్‌కు రూ.4,000 కోట్లు
-వ్యవసాయం, అనుబంధరంగాలకు రూ.8,432 కోట్లు
-పారిశ్రామికాభివృద్థికి రూ.973.74 కోట్లు
-విద్యుత్‌రంగానికి రూ.7,400 కోట్లు
-ఉద్యోగుల జీతభత్యాలకు రూ.22,889 కోట్లు
-నీటిపారుదలకు రూ.8,500 కోట్లు
-వైద్య, ఆరోగ్యానికి రూ.4,932 కోట్లు
-విద్యారంగానికి రూ.11,216 కోట్లు
-హరితహారానికి రూ.325 కోట్లు
– పట్టణాభివృద్ధికి రూ.1,942 కోట్లు
-యాదగిరిగుట్ట అథారిటీకి రూ.100 కోట్లు
-గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు
వెయ్యి మైళ్ల దూరాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని మొదటి అడుగుతోనే ప్రారంభించాలి.. అన్నది లోకోక్తి. బంగారు తెలంగాణను సాధించే క్రమంలో ప్రభుత్వంముందు అనేక వ్యయప్రయాసలున్నా దృఢంగా, వడివడిగా ప్రయాణం ప్రారంభించింది. సీఎం కే చంద్రశేఖర్‌రావు.. గమ్యాన్ని చేరుకునేంతవరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ వెనుతిరిగి చూడరు.

Etela-Rajendar-with-KCR

ఇది చరిత్ర నిరూపించిన సత్యం. ఇప్పుడిది మన రాష్ట్రం. మన తెలంగాణ ఆదాయ వ్యయాలు మనచేతుల్లోనే ఉన్నాయి. చారిత్రక తప్పిదాలను సరిదిద్దే అవకాశమిది. మన ఆవశ్యకతలను దృష్టిలో ఉంచుకుని నవ తెలంగాణను ఆవిష్కరించేందుకు సామాజిక, ఆర్థిక పునర్నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చాం.
– బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్

బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రయాణం వేగం పుంజుకుంది. ప్రాధాన్యరంగాలకు కేటాయింపులు పెంచుకుని.. మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువచేసేందుకు.. రాష్ర్టాన్ని పారిశ్రామికంగా కొత్తపుంతలు తొక్కించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు పరిగణనలోకి తీసుకుంటూ వాటికి వాస్తవరూపం కల్పించేలా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను బుధవారం రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించారు.

తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకోసం అట్టడుగు వర్గాల నిజమైన అభివృద్ధికోసం రూపొందించిన పథకాల సమాహారమే ఈ బడ్జెట్ అన్న ఆర్థికమంత్రి.. అందుకు తగ్గట్టుగానే వివిధ ప్రాధాన్య పథకాలకు గరిష్ఠ కేటాయింపులు చేశారు. గతేడాది పది నెలల కాలానికి 1,00,637.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఈసారి 2015-16 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూ.1,15, 689 కోట్లతో రూపొందించారు. ఇందులో ప్రణాళిక వ్యయం కింద రూ.52,383 కోట్లు, ప్రణాళికేతర వ్యయంకింద రూ.63,306 కోట్లు కేటాయింపులున్నాయి. ఆర్థిక మిగులు రూ.531కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ద్రవ్యలోటు రూ.16,969 కోట్లు, జీఎస్‌డీపీ ద్రవ్యలోటు 3.49 శాతంగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15)తో పోల్చితే ఉద్యోగుల జీతభత్యాల పెంపుదల కారణంగా కొత్త బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం గణనీయంగా పెరిగింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారంగా కేంద్రం రాష్ర్టాలకు ఇచ్చే పన్నుల రాబడుల వాటా 32%నుంచి 42 శాతానికి పెరిగినప్పటికీ తెలంగాణకు కేంద్రం ఇచ్చే ప్రణాళిక నిధుల శాతం తగ్గించడంవల్ల కొత్త వార్షిక బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం పెంచేందుకు ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చిందని ఆర్థిక మంత్రి ఈటల వెల్లడించారు.

గత తొమ్మిది నెలల అతి తక్కువ కాలంలో ప్రభుత్వం అనుసరించిన విధానం రాష్ట్ర ప్రజల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తున్నదని తెలిపారు. వెయ్యి మైళ్ల దూరాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని మొదటి అడుగుతోనే ప్రారంభించాలి అన్నది లోకోక్తి. బంగారు తెలంగాణను సాధించే క్రమంలో ప్రభుత్వంముందు అనేక వ్యయప్రయాసలున్నా దృఢంగా, వడివడిగా ప్రయాణం ప్రారంభించింది అని ఆర్థిక మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. గమ్యాన్ని చేరుకునేంతవరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ వెనుతిరిగి చూడరు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం అని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమనేత కేసీఆర్ గొప్ప పరిపాలనాదక్షుడని ఈటెల కీర్తించారు. దాదాపు గంటసేపు ఈటల బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.

తెలంగాణ ఏర్పాటుతో అభివృద్ధి సన్నగిల్లుతుందని, ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుందని, తీవ్రవాదం పెట్రేగిపోతుందని తెలంగాణ వ్యతిరేకశక్తులు చేసిన ప్రచారాన్ని బడ్జెట్ కేటాయింపులు పటాపంచలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజలకు ఇచ్చిన మాటను జవదాటకుండా వాస్తవరూపం ఇచ్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కృషి బడ్జెట్ లెక్కల్లో ప్రతిఫలించింది. సంక్షేమం, అభివృద్ధి, విద్య, విద్యుత్, చారిత్రక సంస్కృతితోపాటు పారిశ్రామిక అభివృద్ధికి, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం కన్పించింది. మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ ఇండియా అన్న నినాదంతో తెలంగాణ పారిశ్రామిక ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ మన్ననలు ఆందుకునేందుకు భూమిక సిద్ధం చేసింది

వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రంనుంచి పన్నుల రాబడి రూ.12,823కోట్లు మాత్రమేని ఈటల తెలిపారు. ప్రస్తుత సంవత్సరం (2014-15) రాష్ర్టాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్ల మొత్తాన్ని రూ.3,14,814కోట్లనుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(2015-16)లో రూ.1,80,293కోట్లకు తగ్గించింది. దీంతో కేంద్రంనుంచి రాష్ర్టానికి వచ్చే ప్రణాళిక నిధులు 2014-15 బడ్జెట్ అంచనా రూ.11,781కోట్లతో పోలిస్తే 2015-16 ఆర్థికసంవత్సరానికి రూ.6,497 కోట్లు మాత్రమే.

కేంద్రం రాష్ర్టానికి ఇచ్చేనిధుల శాతం తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికమొత్తంలో ప్రణాళిక వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నది అని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 14వ ఆర్థిక సంఘం రాష్ర్టాలలో రుణపరిమితి (బారోయింగ్ లిమిట్)లో కొన్ని నిబంధనలకు లోబడి జీఎస్‌డీపీలో 3.5 శాతానికి పెంచినప్పటికీ, ఇంతవరకు కేంద్రం ఈ సిఫార్సుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కేంద్రంనుంచి రావాల్సిన నిధులు బాగా తగ్గిపోయాయని, అంచనాలమేరకు అవి అంది ఉంటే రాష్ట్ర ఆదాయవ్యయాలను మరింత సమర్థంగా నిర్వహించేవాళ్లమని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ 2014-15లో కేంద్రం నుంచి రావాల్సిన ప్రణాళికా సహాయం రూ.11,781కోట్లు కాగా, 2015 ఫిబ్రవరి నాటికి కేవలం రూ.4,147కోట్లు మాత్రమే వచ్చాయని ఈటల తెలిపారు. అదేవిధంగా కేంద్రంనుంచి అందాల్సిన ప్రణాళికేతర గ్రాంట్లు రూ.9,939కోట్లల్లో ఫిబ్రవరి నాటికి కేవలం రూ.1,346కోట్లు మాత్రమే అందాయన్నారు.

ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం కింద రుణ పరిమితిని సడలించి మరో రూ.4వేల కోట్ల అప్పుకు అవకాశం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రంనుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. దీంతో మొత్తంగా మన ఆదాయవనరుల్లో రూ.20,227 కోట్ల లోటు ఏర్పడుతుందని వివరించారు. ఈ లోటుకు కారణమైన అంశాలేవీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివి కావని స్పష్టం చేశారు. వ్యాట్, భూముల క్రమబద్ధీకరణ మినహా 2014-15లో సమర్పించిన ఓన్-టాక్స్, ఓన్-నాన్‌టాక్స్ ఆదాయాలు గాడిలో ఉన్నాయని మంత్రి ఈటల చెప్పారు. భూముల క్రమబద్ధీకరణ పథకానికి ప్రజలనుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు 3.36లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. 125 చదరపు గజాలలోపు ప్లాటు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పూర్తిగా మినహాయింపు ఇచ్చిందని, దీంతో పేదలకు రూ.30వేల కోట్ల మేరకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణగారిన తెలంగాణ ప్రజలు సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అద్భుతమైన అవకాశం కలిగినందుకు గర్విస్తున్నానని మంత్రి ఈటల తెలిపారు. బడ్జెట్ అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వారి కళ్లల్లో తొణికిసలాడుతున్న కలలు, వారి ఆశలను, ఆకాంక్షలను నిజంచేసే నిర్మాణాత్మకమైన ప్రణాళిక అని చెప్పారు. ఇటీవల 14వ ఆర్థిక సంఘం నివేదిక ఒక చారిత్రక సత్యాన్ని రుజువుచేసిందని మంత్రి వ్యాఖ్యానించారు. దేశంలో గుజరాత్, తెలంగాణ రాష్ర్టాలు రెవెన్యూ మిగులు రాష్ర్టాలుగా ఆర్థిక సంఘం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక లోటు ఎదుర్కొన్న రాష్ట్రంగా ప్రకటించింది.

దీంతో ఉమ్మడి రాష్ట్రం(ఏపీ)లో తెలంగాణ నిధులు మళ్లింపునకు గురయ్యాయని, ఉద్దేశపూర్వకమైన వివక్షే తెలంగాణ ఉసురు తీసిందని పరోక్షంగా ఆ నివేదిక రుజువు చేసింది అని ఈటల వివరించారు. 2015-16 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తలసరి సొంత ఆదాయం రూ.11,872లు, రెవెన్యూ వ్యయం రూ.18,281లు కాగా, తెలంగాణ రాష్ట్రం తలసరి సొంత ఆదాయం రూ.16,274లు, రెవెన్యూ వ్యయం రూ.16,042లుగా రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ 14వ ఆర్థిక సంఘం నివేదికలో వెల్లడించిందని తెలిపారు. దీంతో తెలంగాణలోని మిగులు ఆదాయ వనరులను ఆంధ్రప్రదేశ్‌కు మళ్ళించి ఖర్చుచేశారన్నది స్పష్టమైందన్నారు. ఇప్పుడు ఇది మన రాష్ట్రం. మన తెలంగాణ ఆదాయ వ్యయాలు మనచేతుల్లోనే ఉన్నాయి. చారిత్రక తప్పిదాలను సరిదిద్దే అవకాశం ఇది. మన ఆవశ్యకతలను దృష్టిలో ఉంచుకుని నవ తెలంగాణను ఆవిష్కరించేందుకు సామాజిక, ఆర్థిక పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చాం అని వివరించారు.

తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం అట్టడుగు వర్గాల నిజమైన అభివృద్ధికోసం రూపొందించిన పథకాల సమాహారమే ఈ బడ్జెట్ అని ఈటల అభివర్ణించారు. గత పది నెలల తాత్కాలిక బడ్జెట్‌లో ప్రభుత్వం అనేక ప్రజాసంక్షేమ పథకాలు అమలుచేసిందని ఆయన తెలిపారు. 481మంది తెలంగాణ అమరవీర కుటుంబాలకు రూ.48.10కోట్లు అందించిందని, రాష్ట్రంలోని 35,56,678 మంది రైతులు తీసుకున్న రూ.17వేల కోట్ల పంటరుణాల్లో రూ.4,250కోట్లను ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. 31,24,375 మంది రైతన్నలకు బ్యాంకులనుంచి రూ.16,21,452 కోట్ల మేరకు కొత్త రుణాలను ప్రభుత్వం ఇప్పించిందన్నారు. తెలంగాణ రైతాంగానికి న్యాయబద్ధంగా రావాల్సిన రూ.480.43కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం ఒకే విడతలో చెల్లించి రైతు ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లు నిరూపించుకుందని తెలిపారు.

ఎర్రజొన్న రైతులకు రూ.11.50కోట్ల బకాయిలు చెల్లించామని, ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రూ.484కోట్ల బకాయిలను కూడా చెల్లించామని గుర్తు చేశారు. 33.15లక్షల మంది నిరుపేద కుటుంబాలకు ఆసరా పింఛన్లు, పదకొండు లక్షల మంది విద్యార్థులకు రూ.2,045 కోట్ల మేరకు స్కాలర్‌షిప్ బకాయిలను మంజూరు చేయడంతోపాటు కొత్త సంక్షేమ పథకాలకు, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. నిర్లక్ష్యానికి గురైన రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) అభివృద్ధికి రూ.400కోట్లు మంజూరుచేశామని, రోడ్లు భవనాల శాఖకు రూ. 11,098.33కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.3,722కోట్లు మంజూరుచేసి వాటి పనులను ప్రారంభించామని చెప్పారు. మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలను కలిపే రోడ్లను నాలుగు లైన్ల స్థాయికి పెంచినట్లు తెలిపారు.

ఆహార భద్రత: ప్రతి కుటుంబానికి ఆహారభద్రత కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, బియ్యం రాయితీ పొందే కుటుంబాల ఆదాయ పరిమితిని పెంచడంద్వారా రాష్ట్రంలో ఎక్కువ కుటుంబాలకు అర్హత కల్పించామని మంత్రి ఈటల చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.60వేలుగా ఉన్న కుటుంబవార్షిక ఆదాయాన్ని రూ.1.50లక్షలకు పెంచామని, పట్టణ ప్రాంతాల్లో రూ.75వేలుగా ఉన్న కుటుంబ వార్షిక ఆదాయపరిమితిని రూ.2లక్షలకు పెంచామన్నారు. కుటుంబ భూకమత పరిమితి తరి భూమి అయితే 2.5 ఎకరాల నుంచి 3.5 ఎకరాలకు, ఖుష్కి భూమి అయితే 5 ఎకరాల నుంచి 7.5 ఎకరాలకు పెంచామని వివరించారు. రూపాయికి కిలో బియ్యం పథకం కింద జనవరి ఒకటో తేదీ నుంచి 2.8కోట్ల మందికి మనిషికి నెలకు ఆరు కిలోల చొప్పున గరిష్ఠ పరిమితి లేకుండా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికీ అందజేస్తున్నట్లు చెప్పారు.

హాస్టళ్లు, పాఠశాలలకు సన్నబియ్యం: సమానత్వ సాధనకోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని ఈటల ప్రకటించారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి జనవరి ఒకటినుంచి సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలోని 2,757 సంక్షేమ హాస్టళ్లలో ఉన్న 4,80,926 మంది విద్యార్థులకు, 34,319 ప్రభుత్వ స్కూళ్లలోని 29,86,010 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో అందుతున్నదని తెలిపారు. ఆహార భద్రత, ఆహార సబ్సిడీకోసం రూ.2,200కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

ఉద్యోగులు పునరంకితం కావాలి: బంగారు తెలంగాణ సాకారంకోసం ప్రభుత్వ ఉద్యోగులు పునరంకితం కావాలని ఈటల పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో ఉద్యోగులదే కీలకపాత్రన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎనలేని పోరాటంచేసిన ఉద్యోగులను గౌరవిస్తూ 43% ఫిట్‌మెంట్‌తో ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించిందని చెప్పారు. ఉద్యోగుల జీతభత్యాలకోసం బడ్జెట్‌లో రూ.22,889కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు.

budget-list2