బాబుకు విశ్వసనీయత లేదు

– ఆయన నీతినిజాయితీలేని వ్యక్తి
– బీజేపీ, టీడీపీ పొత్తు అనైతికం: హరీశ్

harishrao
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడటం కష్టమని, బీజేపీతో పొత్తు పెట్టుకుని గట్టెక్కుదామనుకున్నా అది సాధ్యమయ్యే పనికాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు తీసుకున్న యూటర్న్‌లు, చెప్పినమాటలు ఇంకా ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. చివరి నిమిషం వరకు తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబును ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

సోమవారం తెలంగాణభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీతో, బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. పొత్తు వల్ల తమకొచ్చిన భయమేమీ లేదని, కానీ సీమాంధ్రలో టీడీపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తారన్నదే తమ ఆందోళన అన్నారు. పోలవరం డిజైన్ మార్చాలని, ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దని, పోలవరం ముంపు మండలాలు తెలంగాణలోనే ఉండాలని ప్రజలు కోరుతున్నారని, ఈ మేరకు చంద్రబాబు నుంచి బీజేపీ హామీ తీసుకుందా? అని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ పొత్తు అనైతికమని, తెలంగాణ ప్రయోజనాలకు ఈ పొత్తు గొడ్డలిపెట్టు అని అన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి మోడీని ఎవరూ తిట్టనంతగా తిట్టిన చంద్రబాబే నేడు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి పొత్తు పెట్టుకుంటున్నాడని విమర్శించారు. నీతినిజాయితీ లేని బాబు చెప్పే మాటలకు ఎలాంటి విశ్వసనీయత లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రజల మ్యానిఫెస్టోతో, అభ్యర్థుల జాబితాతో పక్కా ప్రణాళికతో ముందుకువెళ్తోందని అన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.