బాబూ.. ఇప్పుడేమంటారు?

– సమైక్యంలోనే చీకట్లు.. స్వరాష్ట్రంలోనే వెలుగులు
– వచ్చే ఏడాది నుంచి కరెంట్ పోవడమే ఉండదు
– భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా

రాష్ట్రం సమైక్యంగా ఉండడమే మంచిది. విడిపోతే తెలంగాణకు కరెంట్ సమస్య వస్తుంది. ప్రజలకు చీకట్లు తప్పవు, ఇబ్బందులు పడతారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చంద్రబాబు పదేపదే వల్లెవేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సీఎం కేసీఆర్ కృషితో విద్యుత్ వెలుగులకు బాటలు పడుతున్నాయి. కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకున్నారు. సమైక్యరాష్ట్రంలో వేసవిలో చీకట్లలో గడిపిన ప్రజలు, ఇప్పుడు విద్యుత్ వెలుగులు చూస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి కరెంట్ పోయే సమస్యే ఉండదు.

Harish-Rao-in-Restoration-of-tanks-in-Medak-District-01చంద్రబాబూ ఇప్పుడేమంటారు అని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమవారం మెదక్ జిల్లా సదాశివపేట మండలం ఎన్కెపల్లి, సంగారెడ్డి మండలం కంది, కొండాపూర్ మండలం గొల్లపల్లిలో చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చూసిన విద్యుత్‌ కష్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోవన్నారు. రాష్ట్రం విడిపోకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు వంటినేతలు కరెంట్ కష్టాలు తప్పవని ప్రజలను తప్పుదారి పట్టించారన్న విషయం ఇప్పుడు తేలిపోయిందన్నారు.

Harish-Rao-in-Restoration-of-tanks-in-Medak-Districtకాంగ్రెస్ హయాంలో నిధుల కోసం ప్రదక్షిణలు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిధుల కోసం మంత్రి జానారెడ్డి ఇంటివద్ద ప్రదక్షిణలు చేశాం. బతిమిలాడితే రూ.50 లక్షలు ఇస్తే గొప్పగా మురిసిపోయాం. రూ.కోటి ఇస్తే దండం పెట్టివచ్చాం. ఇప్పుడా పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నారు అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రోడ్ల మరమ్మత్తు, చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్‌తో పాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులు విడుదల చేస్తున్నారన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ ఎంతో నష్టపోయిందని, వందల ఏండ్ల కిందట కాకతీయులు తవ్వించిన చెరువులు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు.

గత పాలకులు తెలంగాణపై వివక్ష చూపారనడానికి ఇదే నిదర్శనమన్నారు. గతంలో చెరువుల పనులు చేపట్టామని లెక్కలు వేసి కోట్లు దిగమింగరాని ఆరోపించారు. చెరువుల పునరుద్ధరణలో అవినీతి, అక్రమాలకు తావులేదని.. నాణ్యతలోపిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో చెరువుల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే చింతాప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, కలెక్టర్ రాహూల్‌బొజ్జా, ఇరిగేషన్ ఎస్‌ఈ సురేంద్ర, ఈఈ రాములు, ఆర్డీవో మధుకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.