బాబు కుట్రలను ఛేదిస్తాం

-విద్యుత్ కోతలకు చంద్రబాబే కారకుడు
-ఎంత ఆర్థిక భారమైనా మ్యానిఫెస్టోను అమలుచేసి తీరుతాం: మంత్రి హరీశ్‌రావు

Harish Rao

తెలంగాణను రకరకాలుగా ఇబ్బందుల పాల్జేసేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఛేదించి రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తామని భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. మంగళవారం మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం మల్యాలలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కరెంట్‌కోతలకు చంద్రబాబే పరోక్షంగా కారకుడవుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేకరాష్ట్రం ఏర్పడే ప్రతిసందర్భంలో అడుగడుగునా అడ్డంకులు కల్పించిన చంద్రబాబు, ప్రస్తుతం రాష్ర్టానికి విద్యుత్ అందకుండా చేసేందుకు పీపీఏలను రద్దు చేయాలని కేంద్రాన్ని మరోసారి కోరారని.. దీనివెనుక ఎంత కుట్ర దాగి ఉందో స్పష్టమవుతోందన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి ఏదోరకంగా తెలంగాణ ప్రజలను మోసం చేయడం, ఇబ్బందులు కలిగించడం వంటి కుట్రలకు బాబు కేరాఫ్ అడ్రస్‌గా మారాడని దుయ్యబట్టారు.

ఆంధ్రాబాబు కుట్రలను గమనించిన సీఎం కేసీఆర్, ప్రజల అవసరాలను తీర్చేందుకు ఖర్చుకు వెనుకాడకుండా పొరుగురాష్ర్టాల నుంచి విద్యుత్ కొనుగోలుకు చర్యలు చేపట్టారని వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మ్యానిఫెస్టో ప్రకారం అంశాలవారీగా అమలుచేసి తీరుతామని స్పష్టంచేశారు. ప్రధానంగా రైతులకు పంటరుణాల మాఫీ పథకాన్ని అమలుచేస్తామన్నారు. దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమిపంపిణీ, ఇల్లులేని పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం ప్రభుత్వ మొదటి లక్ష్యమని తెలిపారు. పంటరుణాల మాఫీమూలంగా ప్రభుత్వంపై రూ.18 వేల కోట్ల భారం పడుతుందన్నారు. దివంగత సీఎం వైఎస్ తన హయాం లో రూ.3,600 కోట్లు మాత్రమే రైతురుణాలు మాఫీ చేశారన్నారు. కేసీఆర్ నేతత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చినమాటకు కట్టుబడి ఉంటుందన్నారు.