అవినీతిని సహించేది లేదు

వైద్యారోగ్యశాఖలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో సహించబోం. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం అని వైద్యులు, సిబ్బందిని డిప్యూటీ సీఎం రాజయ్య హెచ్చరించారు. మంగళవారం రాత్రి మంచిర్యాల దవాఖానలో బస చేసిన ఆయన, బుధవారం ఉదయం దవాఖానను తనిఖీ చేశారు. అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ,సింగరేణి ఏరియా దవాఖానలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి దవాఖానలను ఆధునీకరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వాల్లో వైద్యరంగానికి వచ్చిన చెడ్డపేరును తొలగిస్తామన్నారు.

Health Minister DR Rajaiah inspect Bellampalli Govt Hospital

-విధులను నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు
-అంకితభావంతో పనిచేస్తే ప్రోత్సాహం
-సర్కారు దవాఖానాల ఆధునీకరణకు కృషి
-డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య
వైద్యశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతోనే దవాఖానల్లో రాత్రి నిద్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిచాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రభుత్వం వైద్యరంగానికి రూ.2,285 కోట్లు వెచ్చించనున్నదన్నారు. ఏరియా దవాఖానలకు రూ.కోటి, జిల్లా ప్రధాన దవాఖానలకు రూ.25 కోట్లు ఖర్చుచేసి స్థాయి పెంచనున్నట్లు వివరించారు. బెల్లంపల్లిలో నిలిచిపోయిన మెడికల్ కళాశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిప్యూటీ సీఎంకు నివేదించడంతో ప్రారంభానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ తూర్పుజిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతారాణి పాల్గొన్నారు.