అవినీతికి తావులేదు..

ప్రతి నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రస్తుతానికి శాంపిల్ మాత్రమే. ఈ మొదటి విడుత తర్వాత భారీ మొత్తంలో అర్హులందరికీ ఇండ్ల నిర్మాణం చేపడుతాం. వీటిలో ముస్లింలకు 12 శాతం ఇండ్లు కేటాయిస్తాం అని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, నూతనంగా నిర్మించిన ఉస్మాన్‌సేట్ షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఇండ్ల నిర్మాణంలో అవినీతికి తావు లేదని, అనర్హులను ఎంపిక చేస్తే తహసీల్దార్‌లే బాధ్యత వహించాలని హెచ్చరించారు. బ్యాంక్‌లతో సంబంధం లేకుండా ప్రభుత్వమే మొత్తం ఇంటి నిర్మాణ ఖర్చు భరిస్తుందని వివరించారు.

Etela Rajendar laid foundation stone for double bed room house scheme
-ఇండ్ల నిర్మాణంలో అవకతవకలకు తహసీల్దార్లదే బాధ్యత
-విడతలవారీగా అర్హులందరికీ ఇండ్లు
-డబుల్ బెడ్‌రూం ఇండ్లలో ముస్లింలకు 12శాతం
-ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్
రాష్ట్రవ్యాస్తంగా తొలి విడతలో 60 వేల ఇండ్లను మంజూరు చేయగా, జిల్లాకు 5,200 కేటాయించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీ మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తామన్నారు. ఇండ్ల మంజూరులో దత్తత గ్రామాలకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు ఏశాఖ పరిధిలో ఉన్నా వాటిని స్వాధీనం చేసుకొని పేదల అవసరాలకు వినియోగించేలా నిబంధనలు మార్చి పలు జీవోలు జారీ చేశామన్నారు. ముస్లింల అభివృద్ధికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఇప్పటికే రూ.1,070 కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేశామని వివరించారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం ద్వారా 1,250 మందికి రూ.51 వేల చొప్పున ఇవ్వగా, మరో 250 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

మైనార్టీల రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం మొదటి విడుతగా రూ.176 కోట్లు కేటాయించామని, దాదాపు 500 మంది విద్యార్థులతో వచ్చే విద్యాసంవత్సరంలో వీటిని ప్రారంభిస్తామని ప్రకటించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఉర్దూ విద్యా సంస్థల్లో బ్యాక్ లాగ్ పోస్టులు ఏర్పడ్డాయని, 70 శాతం మందిని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పోస్టులతో భర్తీ చేశారన్నారు. బంజారాహిల్స్, అబిడ్స్‌లోని పేదలకు జీవో 58, 59 ద్వారా కోట్ల విలువైన భూముల్లో ఉన్న ఇండ్లకు కూడా పట్టాలు ఇచ్చామన్నారు.

ఈ ఘనత కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ముస్లింల సంక్షేమానికి జిల్లాలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి అత్యధికంగా రూ.2.35 కోట్లు కేటాయించామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో హుజూరాబాద్, జమ్మికుంట నగర పంచాయతీల చైర్మన్లు వీ విజయ్‌కుమార్, పీ రామస్వామి, ఎంపీపీ వొడితెల సరోజినీదేవి, జెడ్పీటీసీ సభ్యులు మొలుగూరి సరోజన, ఎం నవీన్, హౌసింగ్ పీడీ నర్సింహరెడ్డి, మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.