ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ సీఎం నిద్ర

– విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న రాజయ్య

Deputy CM Rajaiah
ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య బుధవారం రాత్రి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిద్రించారు. మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి అక్కడే నిద్రించారు. గురువారం విద్యార్థులతో మమేకమై బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

ఆశ్రమ పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. హెచ్‌ఎం రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాజ య్య మాట్లాడారు. తల్లిదండ్రులు గర్వించేస్థాయికి విద్యార్థులు ఎదగాలని కోరారు. ఉపాధ్యాయులు విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ విద్యార్థులకు మార్గదర్శనం చేయాలని సూచించారు. ఎస్టీల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, వారికి 12 శాతం రిజర్వేషన్లు, తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నదన్నారు.