అర్హులెవరినీ తొలగించం

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు, ఆహారభద్రత కార్డులు ఇస్తాం..ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల్ల నియోజకవర్గం లో రూ.53 కోట్లతో చేపట్టే రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి పీ మహేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

KTR in Distribution of Pensions

నవాబుపేటలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్హులందరికీ పింఛన్లు, ఆహారభద్రత కార్డులు పంపిణీ చేస్తామని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగదని హామీఇచ్చారు.

బుధవారం నుంచి 15వరకు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, కలెక్టర్ నేతృత్వంలో పింఛన్లను పంపిణీ చేస్తామని, నెలాఖరు వరకు ఆహారభద్రత కార్డుల పరిశీలన ప్రక్రియపూర్తిచేసి జనవరిలో కార్డులు ఇస్తామని చెప్పారు. ఎవరైనా ఆర్హులు మిగిలిపోతే వారికీ పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఎన్నోఏండ్లుగా పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలనే తపన సీఎం కేసీఆర్‌లో ఉందన్నారు. రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేశారని, రాష్ట్రవ్యాప్తంగా 14,487 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు రూ.18,075 కోట్ల నిధులను కేటాయించినట్లు వెల్లడించారు.

రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్యపాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిధులన్నీ సీమాంధ్రకే తరలించారన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 80 ఏసీ బస్సులను ప్రారంభించామని, మరో వంద ఏసీ బస్సులను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.