ఆర్థిక సంఘానికి ఘనస్వాగతం

-శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన ఆర్థికమంత్రి ఈటెల
-రాజ్‌భవన్‌లో విందు.. సీఎం హాజరు
-నేడు కాకతీయ హోటల్‌లో ఆర్థిక సంఘంతో భేటీ
-ఆర్థిక సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి

KCR-with-Finance-Commission-members-01

పద్నాలుగో ఆర్థిక సంఘం బృందం గురువారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి ఆధ్వర్యంలో 13 మంది సభ్యుల బృందానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. అనంతరం రాత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందుకు ఆర్ధిక సంఘం బృందం హాజరైంది. ఈ విందులో ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతోపాటు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్మకార్యదర్శి నాగిరెడ్డి పాల్గొన్నారు.

శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రాండ్ కాకతీయ హోటల్‌లో 14వ ఆర్థిక సంఘంతో ప్రభుత్వం సమావేశం కానుంది. ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డితోపాటు, సభ్యులు ప్రొఫెసర్ అభిజిత్‌సేన్, సుష్మానాథ్, డాక్టర్ ఎం గోవిందరావు, డాక్టర్ సుదీప్తో ముండే, ఏఎన్ ఝా, సెంథిల్, బాటియా సమావేశంలో పాల్గొంటారు. ఆర్థికసంఘానికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నివేదిక సిద్ధమైంది. శుక్రవారం సమావేశం అనంతరం ఆర్థిక సంఘం సభ్యులకు ఫలక్‌నూమా ఫ్యాలెస్‌లో ప్రభుత్వం విందు ఇవ్వనుంది. ఈ విందుకు ముఖ్యమంత్రితోపాటు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరవుతారు.

కేంద్ర ప్రభుత్వం నియమించిన 14వ ఆర్థిక సంఘం సభ్యులు రాష్ట్ర పర్యటన నేపథ్యంలో వారికి ప్రతిపాదనలు అందించాలనే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తన కార్యాలయంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలు, వాటికి ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తున్నామనే విషయాలను ఆర్థిక సంఘానికి వివరించాలని సీఎం అధికారులకు సూచించారు. మన ఊరు-మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే, చెరువుల పునరుద్ధరణ, హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ, గిరిజన సంక్షేమం, వాటర్ గ్రిడ్, తెలంగాణకు హరితహారం లాంటి వినూత్న కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న విషయాన్ని ఆర్థిక సంఘానికి వివరించి సహకారం కోరాలని నిర్దేశించారు.

12వేల కోట్ల గ్రాంట్లు.. 6వేల కోట్ల బకాయిలు?
14వ ఆర్థిక సంఘంతో శుక్రవారం జరుగనున్న సమావేశంలో ప్రధానంగా రాష్ర్టానికి రావాల్సిన గ్రాంట్లు, పన్నుల బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది. కేంద్ర అమ్మకం పన్నులో రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆర్థిక సంఘాన్ని కోరనుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి సేకరిస్తున్న పన్నుల్లో రాష్ట్రం వాటాను 32 నుంచి 40 శాతానికి పెంచాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరే అవకాముంది.