ఆర్థిక భారాన్ని లెక్కచేయం

-హామీలన్నీ నెరవేర్చి తీరుతాం.. స్వరాష్ట్రంలో పదవి గొప్ప అవకాశం
-ఉద్యమాల్లోంచి వచ్చిన మాకు సమస్యలు తెలుసు
-కొత్త సంసారం.. ప్రజలు సహకరించాలి..
-ప్రతి పేదవాడి కడుపు నిండాలనేదే ధ్యేయం
-నమస్తే తెలంగాణ ఇంటర్యూలో ఆర్ధిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్
ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలుచేసి తీరుతామని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇన్నాళ్లూ ఉద్యమించిన తాము ఇక స్వరాష్ట్ర అభివృద్ధికి అంకితమవుతామని నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Etela Rajendar
నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వంలో తొలి ఆర్థిక, పౌరసరఫరాల మంత్రిగా బాధ్యతలు.. ఎలా ఫీలవుతున్నారు?
ఈటెల రాజేందర్: స్వరాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం ఒక రకంగా ప్రజలకు సేవ చేసే మంచి అవకాశం. తెలంగాణ అభివృద్ధికి ఇదొక కీలకమైన బాధ్యతగా భావిస్తున్నా. కేసీఆర్ ఏ విశ్వాసంతో పదవి ఇచ్చారో దానికి న్యాయం చేస్తా.

నమస్తే: నిన్నటిదాకా ఉద్యమాలు చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చారు. ప్రజలు మీ నుంచి ఏం ఆశించవచ్చు?
ఈటెల: ఉద్యమాల్లో పాల్గొన్నవారికే ప్రజల కష్టసుఖాలు తెలుస్తాయని కేసీఆర్ చెప్తుంటారు. అది నూటికి నూరుపాళ్ళు నిజం. ఉద్యమ ప్రస్థానంలో ప్రజల కష్టాలు, కన్నీళ్ళను ప్రత్యక్షంగా చూశాం. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో మా పార్టీకి, మా నాయకులకు ఉన్నంత అవగాహన ఇతరులకు లేదు. అందువల్ల మేం మెరుగైన పాలన అందిస్తాం. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చే విషయంలో ఎటువంటి రాజీ ఉండదు. ఖచ్చితంగా మా హయాంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న అభివృద్ధి సాధిస్తుంది.

నమస్తే: ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. వారి ఆకాంక్షలను నెరవేర్చుతారా?
ఈటెల: తెలంగాణ రాష్ట్రం కొత్తదే.. ప్రభుత్వం కొత్తదే. కొత్త సంసారం ఎలా ఉంటుందో.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిస్థితి అలాగుంది. అయినాసరే ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం ఖాయం. ఐతే ప్రజలు కూడా కొంత సహకరించాలి. సాధ్యమైనంత త్వరగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నదే కేసీఆర్ లక్ష్యం. ఆ దిశగా మా ప్రయాణం ఉంటుంది.

నమస్తే: ఆర్థికమంత్రిగా మీ తొలి ప్రాధాన్యాలేమిటి? ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారు?
ఈటెల: విద్యార్థి కాలం నుంచే నాకు డబ్బుల ఇబ్బంది ఉండేది. బిజినెస్‌పరంగా కూడా ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నాను. గట్టెక్కడానికి అప్పులు తెచ్చి సర్దుబాటు చేశాను. అలాగ ఆర్థిక వ్యవహారాల విషయంలో వ్యక్తిగతంగా అనుభవముంది. ఎన్నికల ఫలితాలు వచ్చినపుడే కేసీఆర్ నుంచి సంకేతాలు అందాయి. అప్పటినుంచే తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అధ్యయనం చేశాను. నిపుణులను సంప్రదించాను. ఇప్పటికైతే ఓటాన్ ఎక్కౌంట్ బడ్జెటే. ఏదైమైనా ఆర్థిక భారం పడుతుందని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉంటామా? కేసీఆర్ ఇచ్చిన అన్నిహామీలు తూచా తప్పకుండా అమలు చేయాల్సిందే. చేస్తాం కూడా. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా సరే వెనుకాడేది ఉండబోదు.

నమస్తే: పౌరసరఫరాల శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అనే ఆరోపణలున్నాయి. దీనిని ఎలా సరిదిద్దుతారు?
ఈటెల: ముందు శాఖను పటిష్ఠం చేస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు చేరువ చేస్తాం. కల్తీ, కొలతల్లో మోసాలను నియంత్రించడం, అలంకారం కోసం పథకాల్లో పెట్టిన వస్తువులకు కోత పెట్టడం వంటి చర్యలు ఉంటాయి. నిజమైన పేదలకు కడుపునిండా అన్నం దొరికే విధంగా మార్పులు తెస్తాం. అవసరమైతే పేదలకు అదనంగా బియ్యం కూడా ఇస్తాం. పామాయిల్ ఇతర ఆహార ధాన్యాల పంపిణీపై దృష్టి సారిస్తా. అవినీతికి ఫుల్‌స్టాప్‌పెడతా.

నమస్తే: తడిసిన ధాన్యం, మద్దతుధర వంటి విషయంలో ఏ చర్య తీసుకుంటారు?
ఈటెల: రైతుల విషయంలో క్షేత్ర స్థాయి సమస్యలపై నాకు అవగాహన ఉంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించాను. మద్దతు ధర విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు. ధాన్యం అమ్మకం విషయంలో గాబరా పడొద్దు. తడిసిన ధాన్యాన్ని కల్లాల్లో కొనుగోలు చేయాలని, రవాణా సౌకర్యాలను మెరుగు పరచాలని ఆదేశాలు ఇచ్చాం. ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.

నమస్తే: ఉద్యమాల్లో మిమ్మల్ని అరెస్టులు చేసి, కేసులు పెట్టిన పోలీసులు, అధికారులు ఇప్పుడు మీ కింద పనిచేస్తారు. దీన్ని ఎలా చూస్తారు?
ఈటెల: ప్రజాస్వామ్యం గొప్పతనం ఇదే. పోలీసులైనా, అధికారులైనా అధికారం చేపట్టినవారికి అనుగుణంగా పని చేయాల్సిందే.

నమస్తే: మంత్రిగా ఉన్న పరిమితుల్లో గతంలో మాదిరిగా అందరిని కలుపుకు పోవడం సాధ్యమా?
ఈటెల: కలుపుకుపోవడం, పోకపోవడం వంటి అంశాలు వ్యక్తిని బట్టి ఉంటాయి. నా వరకు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను. అధికారం వచ్చిన తర్వాత బ్రోకర్లు, పైరవీకారులు చుట్టుముడతారంటారు. వీరి పట్ల అప్రమత్తంగా ఉంటాను. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. క్షణాల్లో ప్రజలు తమ ఇబ్బందులను నా దృష్టికి తెచ్చే అవకాశముంది. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు. మేమెప్పుడూ తెలంగాణ ప్రజల సేవకులమే.