అపాయింటెడ్ డే మార్పు అనివార్యం

-ఫలితాలు రాగానే ప్రభుత్వం ఏర్పడాలి
-రాజ్యాంగ సంక్షోభానికి తెరతీయవద్దు
-రెండు వారాల వ్యవధితో బేరసారాలకు చాన్స్
– హోంశాఖ కార్యదర్శికి తెలిపిన కేకే బృందం

K Keshava Rao 001

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం (అపాయింటెడ్ డే)ను మే 16 వ తేదీకి మార్చాలని కేంద్రానికి టీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు నేతత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం ఈ మేరకు గురువారం నాడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి వినతిపత్రం అందజేసింది. పార్లమెంటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ ఆవిర్భావ దినాన్ని జూన్ 2వ తేదీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత అసెంబ్లీ రద్దు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ తేదీని మార్చాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.

ఈ మేరకు రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించింది. కోర్టు సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చేందుకు గురువారం పార్టీ ప్రతినిధి బృందం హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లి మంత్రి అందుబాటులో లేకపోవడంతో శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి వినతిపత్రం అందజేసింది. రాష్ట్ర అసెంబ్లీ రద్దు అయిన నేపథ్యంలో మే నెల 16వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలైనా జూన్ 2న అపాయింటెడ్ డే ఉండడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోతుందని టీఆర్‌ఎస్ తన వినతి పత్రంలో పేర్కొంది. ఇంత సుదీర్ఘకాలం ప్రజాప్రభుత్వం లేక పోవడం రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొంది.

నూతన రాష్ట్రం ఏర్పడేదాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో రాజకీయ శూన్యత ఏర్పడుతుందని వివరించింది. అందువల్ల ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మే నెల 16వ తేదీనే ఆపాయింటెడ్ డే వర్తించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు రెండు వారాలకు పైగా ప్రమాణ స్వీకారం చేయకుండా వుండాల్సి రావడం ఒక అసాధారణమైన పరిస్థితి అని, మరో రకంగా ప్రజాస్వామిక హక్కులను హరించడమే అవుతుందని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు మీడియాతో వ్యాఖ్యానించారు.

బేరసారాలకు అవకాశం…: మే నెల 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చి జూన్ 2వ తేదీ వరకు ప్రమాణ స్వీకారం చేయకుండా వుంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఇతర పార్టీలు ప్రలోభపెట్టే అవకాశాలున్నాయని కేకే ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజకీయ పార్టీలకు ఆందోళన కలిగించే అంశమని, దీన్ని కేంద్ర హోంశాఖ దృష్టిలో పెట్టుకుని మే 16వ తేదీనే అపాయింటెడ్ డే గా ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. కేంద్రం ప్రభుత్వం జూన్ 2వ తేదీన ఆపాయింటెడ్ డే గా నిర్ణయం తీసుకునే సమయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వున్న పరిస్థితులు వేరని, ఇప్పుడున్న పరిస్థితులు వేరని, అందువల్లనే ఆవిర్భావ తేదీని ప్రీపోన్ చేయాలని కోరామని ఆయన వివరించారు.

ఈ ప్రతిపాదనకు ఇతర పార్టీలు కూడా కలిసి వస్తాయా అని మీడియా ప్రశ్నించగా, ఇది టీఆర్‌ఎస్‌కు మాత్రమే సంబంధించిన అంశం కాదని, అన్ని రాజకీయపార్టీలకూ సంబంధించినదని బదులిచ్చారు. గత అసెంబ్లీ కాలపరిమితి జూన్ 1 వ తేదీ వరకూ ఉండడం వల్ల ఆ కాల పరిమితి పూర్తిగా ఉండాలనే ఉద్దేశ్యంతో గతంలో కేంద్రం జూన్ 2వ తేదీని ఆవిర్భావ దినంగా ప్రకటించిందని, అయితే ప్రస్తుతం ఆ అసెంబ్లీ రద్దై పోవడం వల్ల కాల పరిమితి సమస్య ఉండబోదని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వినోద్ కుమార్ చెప్పారు.